భోపాల్ ఘటన మరువక ముందే, నోయిడాలో మరో ఘోరమైన వరకట్న కేసు వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్తమామలు పెడుతున్న బాధలు తట్టుకోలేక, 24 ఏళ్ల దీపిక అనే మహిళ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పురా గ్రామంలో జరిగింది.
పెళ్లయిన 14 నెలలకే విషాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపికకు, హృతిక్ అనే యువకుడికి 14 నెలల క్రితమే పెళ్లయింది. పెళ్లి సమయంలోనే ఫార్చ్యూనర్ కారుతో పాటు కోటి రూపాయల కట్నం ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని దీపిక తండ్రి చెప్తున్నారు. అంత ఇచ్చినప్పటికీ, పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు అదనపు కట్నం కోసం దీపికను రోజూ వేధిస్తూనే ఉన్నారు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువై తట్టుకోలేక, మే 17వ తేదీ రాత్రి దీపిక బిల్డింగ్ పైనుంచి దూకేసింది.
శరీరంపై గాయాలు
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. అయితే దీపిక శరీరంపై తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భర్త, మామ అరెస్ట్
దీపిక తండ్రి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దీపిక భర్త హృతిక్, ఆమె మామ మనోజ్ ఇద్దరినీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. "అదనపు కట్నం వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై, దీపికా అనే మహిళ మే 17 రాత్రి బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు.
