V6 News

జార్ఖండ్‌‌‌‌లో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌, నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌‌‌‌లో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌, నలుగురు మావోయిస్టులు మృతి
  • సారండా అడవుల్లో ఐదుగురు జవాన్లకు గాయాలు 

భద్రాచలం, వెలుగు : జార్ఖండ్‌‌‌‌ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లా ఛత్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 209 కోబ్రా బెటాలియన్‌‌‌‌కు చెందిన జవాన్లు ఛత్రా అటవీ ప్రాంతంలో కూంబింగ్‌‌‌‌ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పులు అగిపోయిన అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. నలుగురు మావోయిస్టుల డెడ్‌‌‌‌బాడీలు కనిపించాయి.

చనిపోయిన వారిని సహదేవ్‌‌‌‌ మహతో అలియాస్‌‌‌‌ అనూజ్, ఆర్‌‌‌‌సీఎం నటాషా, ఎస్‌‌‌‌జెడ్‌‌‌‌సీఎం బుధన్‌‌‌‌ కర్మాళ, ఏరియా కమాండర్‌‌‌‌ రంజిత్‌‌‌‌ గుంజులుగా గుర్తించారు. ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ జరిగిన ప్రదేశం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్, ఒక కోల్డ్ ఏఆర్‌‌‌‌ 15 రైఫిల్, ఒక ఇన్సాస్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.

సారండా అడవుల్లో నలుగురు జవాన్లకు గాయాలు

మావోయిస్ట్‌‌‌‌ కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్‌‌‌‌ బెస్రాను టార్గెట్‌‌‌‌గా చేసుకుని జార్ఖండ్‌‌‌‌ పోలీసులు బుధవారం నుంచి అడవులను జల్లెడ పడుతున్నారు. ఒడిశా, జార్ఖండ్‌‌‌‌ బార్డర్‌‌‌‌లోని సింగ్‌‌‌‌భూమా జిల్లా సారండా అడవుల్లో 205 కోబ్రా బలగాలు శుక్రవారం కూంబింగ్‌‌‌‌ చేస్తుండగా.. మావోయిస్టులు కనిపించడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో కోబ్రా ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ సత్యప్రకాశ్‌‌‌‌ సహా జవాన్లు శైలేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ దూబే, ఉత్తమ్‌‌‌‌ సేనాపతి, జితేంద్ర కుమార్‌‌‌‌ రాయ్‌‌‌‌, ప్రేమ్​కుమార్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. గాయపడిన జవాన్లను వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. గాయపడిన మావోయిస్టుల్లో కొందరు చనిపోయి ఉంటారని జార్ఖండ్‌‌‌‌ పోలీసులు అనుమానిస్తున్నారు.