- ఫస్ట్ రెండు రోజులు ఎల్లో అలర్ట్.. తర్వాతి రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫస్ట్ రెండు రోజులకు ఎల్లో అలర్ట్, తర్వాతి రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని పేర్కొంది. దీంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమ, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది. ఆ రెండు రోజులకు ఆరెంజ్అలర్ట్ను ఇష్యూ చేసింది.
సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు, మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీకి రెండు రోజులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, సూర్యాపేట జిల్లాలో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆ జిల్లాతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్సం
గారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 7.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోనూ సాయంత్రం పలు చోట్ల మోస్తరు వర్షం పడింది.