- టీఎస్‌పీఎస్సీ అప్పీల్ డిస్మిస్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : పేపర్ల లీకేజీ కేసు నిందితుల్లోని నలుగురు ఆదివారం జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయనున్నారు. నలగొప్పుల సురేశ్, దామెర రమేశ్ కుమార్, షమీమ్, సాయి సుశ్మిత పేపర్ల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నారు. అందువల్ల వారితో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయించకూడదని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ నిర్ణయంపై నిందితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఎగ్జామ్ రాయడానికి నలుగురికీ అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్. రాజేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్ శనివారం సాయంత్రం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో నిందితులను పరీక్షకు అనుమతించాలని.. వారి ఫలితాల్ని వెల్లడించకూడదని ఉన్నట్లు బెంచ్ గుర్తుచేసింది. అందువల్ల ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని టీఎస్‌పీఎస్సీకి స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకే ఆ నలుగురు నిందితులకు హాల్‌టికెట్లను జారీ చేసి పరీక్షకు అనుమతించాలని కమిషన్‌ను ఆదేశించింది. అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
