స్కూల్ఆటోల్లో ఆరుగురి కంటే ఎక్కువ ఎక్కించొద్దు.. నాలుగేండ్లు దాటిన పిల్లలకు హెల్మెట్ మస్ట్

స్కూల్ఆటోల్లో ఆరుగురి కంటే ఎక్కువ ఎక్కించొద్దు.. నాలుగేండ్లు దాటిన పిల్లలకు హెల్మెట్ మస్ట్
  • రెండు స్కూళ్లు ఉన్నచోట 15 నిమిషాల గ్యాప్​ ఉండాలి
  • నాలుగేండ్లు దాటిన పిల్లలకు హెల్మెట్ ​మస్ట్​
  • ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ 

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ప‌‌వ‌‌ర్ పాయింట్ ప్రజెంటేషన్​ద్వారా నగర ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు. న‌‌గ‌‌రంలో 92.96 లక్షల వాహనాలు ఉన్నాయని..రోజూ సగటున 1,500 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 18 ఏండ్లలోపు 128 మంది పిల్లలు బాధితులు కాగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు.  స్కూల్స్​తమ విస్తీర్ణంలో 30 శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాలన్నారు. స్కూల్ ఆటోల్లో ఆరుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కిస్తే యాక్షన్​తప్పదన్నారు.

ఒకే పరిసర ప్రాంతంలో రెండు కంటే ఎక్కువ స్కూల్స్​ఉన్నచోట బడి ప్రారంభ, ముగింపు టైంలో కనీసం 15 నిమిషాల తేడా ఉండేలా చూసుకోవాలన్నార. టూవీలర్లపై వెళ్లే పిల్లల వయస్సు నాలుగేండ్లు పైబడితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. కార్లలో అయితే పన్నెండేండ్లలోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టకూడదని సూచించారు.

  • డ్రైవర్లకు కంటి సమస్యలు

మైనర్లు వాహనాలు నడుపుతూ దొరికితే ఆర్సీ ఏడాది పాటు రద్దు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఇలా సిటీలో 719 రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. రూల్స్​బ్రేక్​చేసే మైనర్లకు 25 ఏండ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదన్నారు. వాహనాలిచ్చిన తల్లిదండ్రులకు మూడేండ్ల వరకు జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తారన్నారు.

నగరంలో జనవరి నుంచి మే వరకు 2,539 మైనర్ డ్రైవింగ్ కేసులు, 55,995 సెల్‌‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. పోలీసులు నిర్వహించిన మెడికల్ క్యాంపుల్లో 1,014 మంది స్కూల్ డ్రైవర్లను పరీక్షించగా 316 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తేలిందన్నారు.

ఇలాంటి విషయాలపై స్కూల్స్​ ఫోకస్​చేయాలన్నారు. స్కూల్ వాహనాలపై ఆన్​స్కూల్​డ్యూటీ అనే బోర్డు, స్కూల్​పేరు, ఫోన్ నంబర్ స్పష్టంగా రాయాలన్నారు. డ్రైవర్‌‌కు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండి ఎలాంటి నేరాల రికార్డు ఉండకూడదని స్పష్టం చేశారు.