కోవిడ్ ఫోర్త్ వేవ్‌‌పై ఐసీఎంఆర్ ఏడీజీ కీలక వ్యాఖ్యలు

కోవిడ్ ఫోర్త్ వేవ్‌‌పై ఐసీఎంఆర్ ఏడీజీ కీలక వ్యాఖ్యలు

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు అధికంగా రికార్డవుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారంపై ఐసీఎంఆర్ ఏడీజీ (ICMR) సమీరన్ పాండా స్పందించారు. ఫోర్త్ వేవ్ ముప్పు ఉందనే వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసులు అధికం కావడాన్ని దేశ వ్యాప్తంగా పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి డేటాను పరిశీలించాల్సి ఉంటుందని..ప్రతి వేరియంట్ ఆందోళన కలిగించే విధంగా ఉండదని తెలిపారు.

ఇదే విషయంపై మాక్స్ హెల్త్ కేర్ లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ...భారత్ లో ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదని.. మునుపటిలా ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశమే లేదని వెల్లడించారు. భారతదేశంలో కరోనా కేసులు పెరగడంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. కోవిడ్ - 19 ప్రొటోకాల్ కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైరస్ సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సూచించింది. ఇదిలా ఉంటే...భారతదేశంలో శుక్రవారం 7 వేల 584 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.