రైతులే టార్గెట్...సాగు సమయంలో ఊర్లలో వాలిపోతున్న కేటుగాళ్లు

రైతులే టార్గెట్...సాగు సమయంలో ఊర్లలో వాలిపోతున్న కేటుగాళ్లు
  •     పథకాలు, సబ్సిడీ పరికరాలు, రుణాల పేరుతో మోసాలు 
  •     ఈ ఏడాది 20 కేసులు నమోదు చేసిన పోలీసులు 
  •     అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

ఆదిలాబాద్, వెలుగు: రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు వారిని కొత్త తరహాలో మోసం చేస్తూ దోచుకుంటున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ సబ్సిడీలు మంజూరు చేయిస్తామని, తక్కువ ధరలకు వ్యవసాయ పరికరాలు అందిస్తామని, పంటలను అధిక ధరలకు కొనుగోలు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. పథకాల పేరుతో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు లేదా ఇతర సంస్థల పేర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది దళారులు బ్యాంకుల వద్ద తిష్ట వేసి రైతులు తీసుకున్న రుణాల విషయంలో మాయమాటలు చెప్పి రుణాలు తామే చెల్లించి.. తిరిగి దానికి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.

సాగు సమయంలో ఊర్లలో వాలిపోతుండ్రు..

వర్షకాలం పంటల సాగుకోసం రైతులు సిద్ధమవుతున్నారు. పంట పొలాల్లో దుక్కి దున్నుతూ విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుకు వస్తున్నారు. అయితే పంట పెట్టుబడికి డబ్బులు లేని రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. మరోపక్క సాగు సమయంలో మరికొంత మంది దళారులు రైతులకు అవసరమైన పంట రుణాలు, పరికరాలు, ఇతర సబ్సిడీ ట్రాక్టర్లను ఇప్పిస్తామంటూ ఊర్లలో వాలిపోతున్నారు. 

ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి 50 శాతం సబ్సిడీ పేరుతో మభ్యపెడుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సబ్సిడీపై ప్రభుత్వ పథకాలను అందిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక ఆదివాసీ రైతుల పొలాల్లో బోర్లు వేయిస్తామంటూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వరుస దాడులతో దళారుల మోసాలు బయటపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో 20 మంది దళారులపై కేసు నమోదు చేశారు. 

జిల్లాలో రైతులను మోసం చేసిన కొన్ని కేసుల

  • స్వచ్ఛంద సంస్థ ద్వారా సబ్సిడీ ధరకు ట్రాక్టర్లు, కలుపు తీసే యంత్రాలు ఇప్పిస్తామని చెప్పి ఉట్నూర్​కు చెందిన నలుగురు రైతుల నుంచి రూ.12 లక్షలు వసూలు చేసి మోసం చేసిన మంచిర్యాలకు చెందిన చంద్రమౌళిని మే 10న పోలీసులు అరెస్ట్ చేశారు. 
  • ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని వారం క్రితం ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్​గావ్​కు చెందిన రైతులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన హేమంత్ కుమార్, ముద్దిరాల ఆనంద్ గ్రామ రైతులను కలిసి ఎర్రచందనం మొక్కలు, వాటి సంరక్షణకు సౌర కంచె, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి బోరు బావులు వేయిస్తామంటూ ఆరుగురి నుంచి రూ. 5.20 లక్షలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. గత వారం క్రితం బాధితులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా ఈనెల 3న వారిని అరెస్ట్ చేశారు.
  • గతేడాది జూన్ లో బ్యాంకుల వద్ద పోలీసులు ఏకకాలంలో దాడులు చేసి 34 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి, తిరిగి రైతులకు అధిక రుణాన్ని ఇప్పించడం కోసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.