అథ్లెటిక్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు దేశం ముందంజ: ప్రధాని మోడీ

అథ్లెటిక్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు దేశం ముందంజ: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు పలు రంగాల్లో దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా రంగాల్లో అచీవర్స్​కు ఆయన అభినందనలు తెలిపారు. పరుగు పందెంలో 100 మీటర్ల రికార్డులను బద్దలు కొట్టిన గుర్విందర్ వీర్, అనిమేశ్ కుజుర్​లను ఆయన ప్రశంసించారు. 

కేరళకు చెందిన సజీ వలశేరిల్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన చోళుల నాటి రాగి పలకలు, ఆస్ట్రానమీ క్లబ్బులు, సైనికుల కోసం విద్యార్థుల విరాళాల సేకరణకు కృషి చేసిన చెన్నై విద్యావేత్త గిరిజ అమ్మను కూడా ప్రధాని కొనియాడారు. మన్ కీ బాత్ రేడియో ప్రసంగం 134వ ఎపిసోడ్​లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం అనేక విషయాలపై మాట్లాడారు.

 ఇటీవల జార్ఖండ్​లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలలో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. ‘‘ఈ ఈవెంట్​లో 4 వేర్వేరు విభాగాల్లో 4 జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. గుర్విందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్.. వివిధ విభాగాలలో కొత్త రికార్డులను సృష్టించారు. ముందుగా, వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.

విద్యార్థుల మునకతో పుట్టిన స్విమ్మింగ్ క్లబ్.. 

కేరళలోని ఆలూవాలో సజీ వలశేరిల్ నడుపుతున్న స్విమ్మింగ్ క్లబ్‌‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులతో సహా 15,000 కంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఈత నేర్చుకున్నారని తెలిపారు. “సజీ జీ దివ్యాంగ పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక ఒక బాధాకర ఘటన కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించిన తర్వాత సజీ ఈ చొరవను ప్రారంభించారు. ఈత తెలిసి ఉంటే ఆ పిల్లల్లో ఎంతోమంది బతికేవారని ఆయన భావించారు. అక్కడి నుంచే ఆయన ప్రయత్నం  ప్రారంభమైంది” అని ప్రధాని వివరించారు.

చోళుల కాలం నాటి రాగి పలకలు.. 

ఇటీవలి తన ఐదు దేశాల పర్యటనలో నెదర్లాండ్స్ తిరిగి ఇచ్చిన చోళుల కాలం నాటి రాగి పలకలను కూడా ప్రధాని ప్రస్తావించారు. “ఈ రాగి పలకల పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉంది. వీటిలో 21 పెద్దవి, 3 చిన్నవి ఉన్నాయి. ఇవి.. తన తండ్రి రాజరాజ చోళుడి మొక్కును నెరవేరుస్తూ మొదటి రాజేంద్ర చోళ రాజు చేసిన పనులకు సంబంధించినవి” అని తెలిపారు. 

ఆస్ట్రానమీపై అవగాహన పెంచుతున్నరు.. 

ఆస్ట్రానమీ తరతరాలుగా భారతీయులను ఎంతగానో ఆకర్షించిందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ ప్రయత్నిస్తోందన్నారు.  “ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రిపూట నక్షత్రాల పరిశీలన శిబిరాలు, వర్క్‌‌షాప్‌‌లను నిర్వహిస్తుంది. రాజ్‌‌కోట్‌‌కు చెందిన బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి కచ్ రణ్ వరకు అనేక ఖగోళ ఈవెంట్లను నిర్వహించింది” అని మోదీ వివరించారు.

సైనికులకు విద్యార్థుల సాయం స్ఫూర్తిదాయకం

తమిళనాడుకు చెందిన విద్యావేత్త గిరిజ అమ్మ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఆమె చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయంతో సహా 15 స్కూళ్లను నడుపుతున్నారు. “మన్ కీ బాత్ స్ఫూర్తితో, సైనికుల కోసం రోజూ ఒక రూపాయి విరాళం ఇవ్వాలని పిల్లలను కోరారు. ఈ చిన్న విరాళాలతో దాదాపు రూ.40 లక్షలు వసూలయ్యాయి” అని చెప్పారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును గిరిజ అమ్మ సైన్యానికి అందజేశారని మోదీ చెప్పారు.

ఎండలు మండుతున్నయ్.. జాగ్రత్త 

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ‘శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఎండలోకి వెళ్లవలసి వస్తే, అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని ఆయన సూచించారు. వేసవిలో మామిడి పండ్ల గురించి మాట్లాడుకోని ఇల్లు దాదాపు ఉండదని ప్రధాని పేర్కొన్నారు. ‘మహారాష్ట్రకు చెందిన హాపుస్ లేదా అల్ఫోన్సో, గుజరాత్​కు చెందిన కేసర్ వంటి రకాలు మామిడికి జీవనాడులు.

 ఉత్తరప్రదేశ్​కు చెందిన దసేరి, కాశీకి చెందిన లంగ్డా, బిహార్​కు చెందిన మామిడి పండ్ల సువాసనను దూరం నుంచే ఆస్వాదించవచ్చు. చౌసా, మాల్దా పేరుతోనూ మామిడితో ప్రజల జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి’ అని చెప్పారు. దక్షిణాదిలో బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా వంటి ఇతర రకాలు ఉంటాయన్నారు. బెంగాల్​లో హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లలో సువర్ణరేఖ వంటివి కనిపిస్తాయన్నారు.