ఉదయం లేస్తే.. అప్పుల వెతుకులాటే...రాష్ట్ర సర్కారు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

ఉదయం లేస్తే.. అప్పుల వెతుకులాటే...రాష్ట్ర సర్కారు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ
  •     బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని దివాలా తీయించాయని ఫైర్

పద్మారావునగర్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి రోజుకో ప్రకటన చేస్తున్నా.. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, ఉదయం లేస్తే ఎక్కడ అప్పు దొరుకుతుందా అని ప్రభుత్వం వెతుకుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి దివాలా తీయించాయని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వానికి జనం బ్రహ్మరథం పడుతున్నారని, తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. 

ఈ నెల 10న జరిగే సభే అందుకు నాంది అని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్​తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులకు, పార్టీ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈ వేదిక నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు.  

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు కదులుతున్నాయని, గద్వాల, సిర్పూర్ కాగజ్‌‌నగర్, మంచిర్యాల, ఖమ్మం నుంచి పార్టీ తరఫున ప్రత్యేక రైళ్లను బుక్ చేశామని వివరించారు. దేశం కోసం మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, 'మోదీ కోసం మనం' అనే నినాదంతో ప్రజలందరూ తరలివచ్చి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.