హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై స్పందించిన ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగుల జేఏసీ లేవనెత్తిన అంశాలపై ‘స్టేటస్ రిపోర్ట్’ అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) ఆదేశించింది.
వచ్చే నెల 1వ తేదీలోగా ఈ రిపోర్ట్ పంపాలని జీఏడీ స్పెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా శాఖలకు సర్క్యులర్ పంపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ప్రకటన, పెండింగ్ డీఏల విడుదల, మెడికల్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విడుదల, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 205 సంఘాల జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
ఇటీవల సెక్రటేరియెట్ లోపల, బయట, జిల్లా కలెక్టరేట్ల దగ్గర భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వచ్చే నెల 5వ తేదీన నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఇప్పటికే జేఏసీ ప్రకటించింది.15 వరకు ప్రభుత్వం స్పందించాలని లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో నిరాహార దీక్షకు ముందే స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకొని కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

