- హైదరాబాద్ ప్రపంచ సినిమా అడ్డాగా మారాలి: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘గద్దర్ ఫిలిం అవార్డుల’ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఉగాది పర్వదినాన ‘న భూతో న భవిష్యత్’అన్న రీతిలో ఈ వేడుక జరగనుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గద్దర్ ఫిలిం అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
భట్టి మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సామాజిక మార్పు కోసం గళాన్ని, కళను ఆయుధంగా మలుచుకున్న మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. హైదరాబాద్ ప్రపంచ సినిమాకు కేంద్ర బిందువుగా మారాలని భట్టి అన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక బ్లూప్రింట్‌తో ముందుకెళ్తోందని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, అర్ధరాత్రి మా తలుపు తట్టొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’అని భరోసా ఇచ్చారు. జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఈడీ కిషోర్ బాబు పాల్గొన్నారు.
