- పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని 4, 931 కి.మీల జాతీయ రహదారుల నాణ్యత, పురోగతి, నిర్వహణపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఢిల్లీలోని జరిగిన ఈ సమావేశంలో శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్(2,035కి.మీ), లద్ధాఖ్ (804 కి.మీ) నేషనల్ హైవే ప్రాజెక్ట్ లపై వేరు వేరుగా సమీక్షించారు. ప్రధానంగా మీడియాలో ప్రసారమైన కథనాలు, సోషల్ మీడియాలో ప్రజల ఫిర్యాదులు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల సమాచారం, కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎన్ హెచ్ఏఐ, ఇతర వర్గాల సమాచారంపై కీలకంగా చర్చించారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..రోడ్డు పనుల్లో నాణ్యత, జవాబుదారీతనం, అత్యున్నత ప్రమాణాలను ఫాలో అవుతూ ప్రాజెక్ట్ లను వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. పర్యావేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, నిర్ధిష్ట సమయంలోపు పనులు పూర్తి చేయాలని, హైవే కారిడార్లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అత్యున్నత పద్దతులను అనుసరించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాజెక్ట్ లలో తగిన సన్నాహక చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు.
