
హైదరాబాద్ లో తొలిసారి
గాంధీ డాక్టర్ల అరుదైన ఘనత
స్వైన్ ఫ్లూ గర్భిణికి డెలివరీ
తల్లి, బిడ్డకు ప్రాణాపాయం తప్పించిన గాంధీ డాక్టర్లు
కార్పొరేట్ హాస్పిటళ్లు చేతులెత్తేసిన కేసులో గాంధీ డాక్టర్ల విజయం
స్వైన్ ఫ్లూ తో వచ్చిన 9 నెలల గర్భవతికి చికిత్స అందించడమే కాదు… ఆమెకు సుఖప్రసవం చేసి రెండు ప్రాణాలు కాపాడారు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు. మౌలాలికి చెందిన ఫాతిమా 9నెలల గర్భవతి. ఆమెకు ప్రసవం సమయానికి 10 రోజుల ముందే స్వైన్ ఫ్లూ సోకింది. కీలకమైన సమయంలో ఆమెకు స్వైన్ ఫ్లూ సోకడంతో…. తల్లి, కడుపులోని బిడ్డ ఇద్దరికీ ప్రాణాపాయం ఏర్పడింది. ఆందోళనతో కుటుంబసభ్యులు ఆమెను పలు కార్పొరేట్ హాస్పిటళ్లకు తీసుకెళ్లారు. ఐతే… ఈ కండిషన్ లో ఆమెకు చికిత్స అందించి… డెలివరీ చేయాలంటే తమ వల్ల కాదని ఒకరు…., లక్షల్లో ఖర్చవుతుంది కానీ వారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని మరో హాస్పిటల్ వాళ్లు చేతులెత్తేశారు.
ఆ పరిస్థితుల్లో ఫాతిమాను.. పెద్దాసుపత్రి అయిన గాంధీకి వచ్చారు. గాంధీ వైద్యులు స్వైన్ ఫ్లూ వార్డులో చేర్చుకొని ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఫాతిమాకు స్వైన్ ఫ్లూను నయం చేయడమే కాదు… స్వైన్ ఫ్లూ వార్డ్ వెంటిలేటర్ పైనే సుఖ ప్రసవం చేశారు. స్వైన్ ఫ్లూ సోకకుండా అత్యంత జాగ్రత్తగా డెలివరీ చేసి… పండంటి బాబుకు ప్రాణం పోశారు. స్వైన్ ఫ్లూ, ప్రసూతి వైద్యులతో పాటు అన్ని విభాగాల డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో, ధైర్యంతో ఈ చికిత్స అందించి విజయవంతం అయ్యారని గాంధీ హాస్పిటల్ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్ చెప్పారు. హాస్పిటల్ డాక్టర్లను, సిబ్బందిని అభినందించారు. స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్సచేస్తూ హై రిస్కుతో డెలివరీ చేయడం హైద్రాబాద్ లో ఇదే మొదటిసారని డా.శ్రవణ్ తెలిపారు.
రిస్క్ తీసుకొని ఎటువంటి అపాయం లేకుండా ప్రసవం చేసిన వైద్యులకు ఫాతిమా, మోబిన్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

