హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..

హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..
  • మహా గణపయ్యా.. మళ్లీ రావయ్యా..గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు
  • 4 గంటల పాటుఅంగరంగ వైభవంగా శోభాయాత్ర 
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం
  • ఉదయం 7:43 గంటలకు శోభాయాత్ర ప్రారంభం 
  • మధ్యాహ్నం 1:45 గంటలకు నిమజ్జనం పూర్తి
  • 11 రోజుల్లో మహా గణపతిని దర్శించుకున్న 50 లక్షల మంది 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 11 రోజుల పాటు పూజలందుకున్న బడా గణేశ్‌‌‌‌ నిమజ్జనం శనివారం పూర్తయింది. బొజ్జ గణపయ్యకు బైబై చెప్పేందుకు లక్షలాది మంది భక్తజనం ట్యాంక్‌‌బండ్‌‌కు తరలివచ్చారు. ‘జైజై గణేశా.. బైబై గణేశా’, ‘మహా గణపయ్యా.. మళ్లీ రావయ్యా’ అంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. అంతకుముందు బడా గణేశ్ శోభాయాత్ర కనులపండువగా సాగింది. శనివారం ఉదయం 7:43 గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. సెన్సేషన్​థియేటర్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియెట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సాగింది. దాదాపు 4 గంటల పాటు అంగరంగ వైభవంగా శోభాయాత్ర కొనసాగింది. ఉదయం 11:40 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌‌లోని 4వ నెంబర్ క్రేన్ వద్దకు బడా గణేశుడు చేరుకోగా.. డీవెల్డింగ్ పనులు, పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సంపూర్ణ నిమజ్జనం పూర్తయింది. 

ఆలస్యమైనా సాఫీగా..   

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి శుక్రవారం రాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు గణనాథుడికి కలశ పూజ చేశారు. అనంతరం గణపయ్యకు ఇరువైపులా ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ అమ్మవార్లను ప్రత్యేక టస్కర్‌‌‌‌లోకి ఎక్కించారు. అది గణేశుడి టస్కర్ ముందు వెళ్లేందుకు సిద్ధం చేశారు. తర్వాత బడా గణేశ్‌‌ను టస్కర్ మీదకు ఎక్కించే కార్యక్రమం మొదలైంది. శనివారం తెల్లవారుజామున 5 గంటల కల్లా బడా గణేశుడు 26 టైర్ల భారీ టస్కర్​మీదకు చేరుకున్నాడు. 

తర్వాత వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. టస్కర్‌‌‌‌కు అమర్చిన బేస్ ఫ్రేమ్‌‌కు, గణనాథుడి అడుగున ఉన్న లిఫ్టింగ్​ఫ్రేమ్‌‌ను అమరుస్తూ వెల్డింగ్​చేశారు. ఇది పూర్తయ్యేందుకు దాదాపు 2 గంటలు పట్టింది. దీంతో 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర.. ఉదయం 7:43 గంటలకు మొదలైంది. శోభాయాత్ర గంట ఆలస్యమైనప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది. 

భారీగా తరలివచ్చిన భక్తులు..  

బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 5 గంటలకే ఖైరతాబాద్ చేరుకున్నారు. అయితే అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతుండడంతో అనుమతించలేదు. పనులు పూర్తయిన తర్వాత 6 గంటలకు బారికేడ్లు ఓపెన్ చేసి, భక్తులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 7:43 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కాగా.. భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 10 గంటల కల్లా శోభాయాత్ర రాజ్‌‌దూత్​హోటల్​వద్దకు చేరుకోగా, భక్తుల సంఖ్య మరింత పెరిగింది. నిమజ్జనం పూర్తయ్యే వరకు గణపయ్యకు జనం నీరాజనం పట్టారు. లక్షలాది మంది తరలివచ్చి గణనాథుడికి వీడ్కోలు పలికారు. భారీ భద్రత మధ్య బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్ద ప్రశాంతంగా నిమజ్జనం ముగిసింది. కాగా, ఖైరతాబాద్ బడా గణపతి ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించారు. 

డప్పుచప్పుళ్లు.. డ్యాన్సులు 

నిమజ్జన వేళ ట్యాంక్‌‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ డప్పులు, డీజే చప్పుళ్లతో మార్మోగాయి. గణనాథులకు వీడ్కోలు పలికేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియెట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో బారులు తీరారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ గణపయ్యలకు వీడ్కోలు పలికారు. ఇటు బడా గణేశ్, అటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణపయ్యలకు వీడ్కోలు పలుకుతూ పులకించిపోయారు. గ‌‌ణ‌‌ప‌‌తి బ‌‌ప్పా మోరియా.. జైజై గణేశా.. బైబై గణేశా అంటూ నినాదాలు చేశారు.   

హైదరాబాద్‌, వెలుగు: భారీ పోలీస్ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం బాలాపూర్ గణేష్‌ ఊరేగింపుతో ప్రారంభమైన నిమజ్జనాలు.. ఆదివారం ఉదయం కూడా జరుగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిమజ్జనాలను డీజీపీ జితేందర్ సహా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు పర్యవేక్షించారు. ఓల్డ్‌సిటీ మీదుగా సాగిన ప్రధాన శోభాయాత్ర, హుస్సేన్‌సాగర్‌‌, సరూర్‌‌నగర్‌‌ మినీట్యాంక్‌ బండ్‌ సహా సిటీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌, బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెట్‌ కమాండ్ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌‌ ద్వారా డీజీపీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమంలో పోలీసులకు ప్రజల నుంచి మంచి సహకారం లభించిందన్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగానే బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం అదనపు సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని తెలిపారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎక్కడా ఆటంకం లేకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగాయన్నారు. డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్పీఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్స్, తదితర శాఖల సిబ్బంది కూడా పాల్గొన్నారని తెలిపారు.

ట్యాంక్‌‌బండ్‌‌కు సింపుల్‌‌గా సీఎం రేవంత్‌‌ గణేశ్ నిమజ్జనాలు పరిశీలన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని హుస్సేన్‌‌సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆయన శనివారం సాయంత్రం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కాన్వాయ్ లేకుండా సింపుల్‌‌గా ఎన్టీఆర్ మార్గ్‌‌కు వెళ్లారు. కేవలం సెక్యూరిటీ ఉన్న మూడు వాహనాలతో అక్కడికి వెళ్లిన సీఎం రేవంత్.. భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం కారు దిగి భక్తులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నిమజ్జనాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సెక్రటేరియెట్ ఎదుట ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి స్వాగత మండపం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వేదిక పైనుంచి భక్తులకు అభివాదం చేస్తూ.. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించారు.  

నిఘా నీడలో నిమజ్జనం.. 

హైదరాబాద్ వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆకతాయిలను గుర్తించేందుకు షీటీమ్స్, ఎస్‌‌వోటీ, మఫ్టీలో పోలీసులు విధులు నిర్వహించారు. శోభాయాత్రను కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ నుంచి ప్రత్యేక టీమ్‌‌లు మానిటర్ చేశాయి.

11 రోజుల్లో 50 లక్షల మంది..  

ఖైరతాబాద్ గణేశుడు 11 రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్నాడు. ఈ 11 రోజుల్లో దాదాపు 50 లక్షల మంది భక్తులు బడా గణేశుడిని దర్శించుకున్నారు. ఇక నిమ జ్జన శోభాయాత్రలో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు అంచ నా వేస్తున్నారు. గణనాథుడిని చూసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటక నుంచి జనం తరలివచ్చారు. 

  • బడా గణేశుడి శోభాయాత్ర సాగిందిలా.. 
  • శనివారం ఉదయం 6:04 గంటలు: 
  • టస్కర్ మీదకు చేరుకున్న గణనాథుడు  
  • 7:10: వెల్డింగ్ పనులు పూర్తి
  • 7:15: కొబ్బరికాయ కొట్టి పూజలు చేసిన నిర్వాహకులు 
  • 7:43: ప్రారంభమైన శోభాయాత్ర 
  • 9:40: రాజ్‌‌దూత్ హోటల్ దగ్గరికి చేరుకున్న శోభాయాత్ర 
  • 10.07: టెలిఫోన్ భవన్ దగ్గరికి చేరుకున్న శోభాయాత్ర
  • 10:30: సెక్రటేరియెట్ దగ్గరికి చేరుకున్న శోభాయాత్ర 
  • 11:40: ఎన్టీఆర్​మార్గ్‌‌లోని 4వ నెంబర్​క్రేన్ 
  •     వద్దకు చేరుకున్న బడా గణేశుడు  మధ్యాహ్నం ఒంటిగంట: డీవెల్డింగ్ పనులు పూర్తి గణనాథుడిని కదిలించిన నిర్వాహకులు 
  • 1.20: గంగను తాకిన గణనాథుడు, 1.45: సంపూర్ణ నిమజ్జనం