మొదలైన గణేశ్ శోభాయాత్ర..

మొదలైన గణేశ్ శోభాయాత్ర..

ఘనంగా పూజలందుకున్న ఘననాథులు గంగమ్మ ఒడి చేరేందుకు సిద్ధమయ్యారు. చివరి పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతిని భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి విగ్రహాన్ని నిర్వాహకులు ఎక్కించారు. భారీ గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే భక్తులు  చేరుకున్నారు. ఈ మహా ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. హుస్సేన్ సాగర్ సహా నగరంలోని 32 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు  ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేశారు.

నిమజ్జనం కోసం బల్దియా 20 కోట్ల రూపాయలు కేటాయించింది. శోభాయాత్ర మార్గంలో సానిటేషన్ పనులకు 194 ప్రత్యేక బలగాలను సిద్ధం చేసింది..అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని చెబుతున్నారు. ఇవాల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జన  జరగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీసీ కెమెరాలను లింక్ చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు.

  •  నిమజ్జనం సందర్భంగా ప్రతీ 3 కిలోమీటర్లకు ఒక యాక్షన్ టీమ్ పనిచేస్తుంది. ఒక్కో టీమ్ లో ఓ శానిటరి సూపర్ వైజర్, శానిటరీ జవాన్, ముగ్గురు SFAలు, 21 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. సానిటేషన్ వర్క్స్ కోసం 481 మంది సూపర్ వైజర్లు, 719 SFA లు సహా 9 వేల 849 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. ప్రజలంతా శాంతియుతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు.
  • హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం కోసం 44 క్రేన్లను అందుబాటులో ఉంచారు బల్దియా అధికారులు. 32 నిమజ్జన ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్లతో పాటు, 134 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉన్నాయి.
  • నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు అధికారులు. 92 మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేశారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 30 లక్షల 52 వేల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. శోభయాత్ర మార్గంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు, 75 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్లో 7 బోట్లతో పాటు 4 స్పీడ్ బోట్లను సిద్ధం చేశారు. వంద మంది గజ ఈతగాళ్లను రప్పించారు.

వినాయక నిమజ్జనంతో గ్రేటర్ పరిధిలో ఇవాళ సెలవు ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సెలవు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ నెల 14 రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.