V6 News

డిగ్రీ కాలేజీల్లో గంజాయి గ్యాంగ్ లు.. ఐటీఐ, పాలిటెక్నిక్ లోనూ మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్స్..

డిగ్రీ కాలేజీల్లో గంజాయి గ్యాంగ్ లు.. ఐటీఐ, పాలిటెక్నిక్ లోనూ మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్స్..
  • మంచిర్యాలలోని ఓ ప్రైవేట్  కాలేజీలోనే 15 మంది గుర్తింపు
  • ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా మొదలై ప్రమాదకర పరిస్థితికి 
  • పాజిటివ్ కేసులను డీ అడిక్షన్  సెంటర్​కు పంపుతున్న పోలీసులు
  • కాలేజీల్లో నిఘా పెడితేనే కంట్రోలయ్యే చాన్స్ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో యువత గంజాయి మత్తుకు బానిసవుతోంది. ముఖ్యంగా డిగ్రీ కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్  స్టూడెంట్లు ఈ వ్యసనానికి అలవాటై పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలతో కాలేజీలకు పంపిస్తే కొంత మంది ఫ్రెండ్స్​తో కలిసి గంజాయి తాగుతూ బలాదూర్​గా తిరుగుతున్నారు. చదువు సంధ్యలు పక్కనపెట్టి మత్తులో మునిగి తేలుతూ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు గుర్తించే సరికి పరిస్థితి చేయి దాటిపోతోంది. రోజురోజుకు ఈ వ్యసనం చాప కింద నీరులా విస్తరిస్తుండడంతో యువత భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

మత్తులో విద్యార్థులు.. 

గతంలో బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్  కాలేజీలో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ఆరుగురు విద్యార్థులను సస్పెండ్  చేశారు. మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి కాలేజీ స్టూడెంట్లకు గంజాయి అందజేస్తున్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్  డిగ్రీ కాలేజీ గంజాయి గ్యాంగ్​లకు అడ్డాగా మారినట్టు సమాచారం. గత కొంతకాలంగా గవర్నమెంట్  హా స్పిటల్​లోని డీ అడిక్షన్  సెంటర్​కు వచ్చిన వారిలో ఈ కాలేజీ నుంచే 15 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. 

బయటపడని వారు ఇంకా ఎంత మంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ మేనేజ్​మెంట్  ఫీజులు దండుకోవడం తప్ప విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అదేవిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్  విద్యార్థులు సైతం గంజాయి మత్తును ఎంజాయ్  చేస్తున్నారు. పోలీసులు కాలేజీపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కంట్రోల్  చేసే పరిస్థితి లేదని అంటున్నారు. 

యూత్  టార్గెట్​గా అమ్మకాలు..

గంజాయి ముఠాలు 16 నుంచి 25 ఏండ్ల వయసు ఉన్న వారిని టార్గెట్​గా చేసుకొని విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్​ను లక్ష్యంగా చేసుకొని వారిని ఉచ్చులోకి లాగుతున్నారు. కొంత మంది విద్యార్థుల బలహీనతను ఆసరాగా చేసుకొని మెల్లగా మత్తులో దించుతున్నారు. వారి ద్వారా ఫ్రెండ్స్​కు అలవాటు చేసేలా ఎంకరేజ్  చేస్తున్నారు. ఈ వ్యవసం ఫ్రెండ్స్  గ్రూపుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటోంది. మహారాష్ట్ర, ఏపీ, ఒడిశాతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువగా గంజాయి సప్లై అవుతోంది. ఏజెంట్లు చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి యువతకు అమ్ముతున్నారు. 

జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, అశోక్  రోడ్డు, పోచమ్మ చెరువు, పాత మంచిర్యాల, సబ్  స్టేషన్  ఏరియా, రాళ్లవాగు ఏరియా, కాలేజీ రోడ్, అండాలమ్మ కాలనీ, చున్నంబట్టివాడ, ఎన్టీఆర్  నగర్, రాజీవ్​నగర్  తదితర ప్రాంతాలు గంజాయి అడ్డాలుగా మారాయి. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, నస్పూర్, శ్రీరాంపూర్, చెన్నూర్, లక్సెట్టిపేట టౌన్లతో పాటు రూరల్  మండలాల్లో సైతం గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

పాజిటివ్  కేసులు డీ అడిక్షన్  సెంటర్​కు..

గంజాయి పాజిటివ్​గా నిర్దారించిన కేసులను పోలీసులు జీజీహెచ్​లోని డీ అడిక్షన్  సెంటర్​కు పంపుతున్నారు. 2023 జూన్​లో ఈ సెంటర్​ ఏర్పాటు చేయగా, ఇటీవల దానిని విస్తరించారు. గత ఏడాది 20 మంది, ఈ ఏడాది ఇప్పటివరకు 10 మంది యువకులకు అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్  చేశారు. గంజాయికి అలవాటుపడ్డ వారు మానసికంగా కోలుకునేంత వరకు ఫ్యామిలీ మెంబర్స్  సమక్షంలో కౌన్సెలింగ్  చేయడంతో పాటు మందులు అందిస్తున్నారు. 

ఈ సెంటర్​కు వచ్చే వారిలో మైనర్లతో పాటు 18 నుంచి 25 ఏండ్ల లోపు యువకులే ఎక్కువగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నూర్  ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు డీ అడిక్షన్​ సెంటర్లో చికిత్స పొందుతున్నారు.

16 నుంచి 25 ఏండ్ల వారే ఎక్కువ..

గంజాయి వ్యసనానికి బానిసలవుతున్న వారిలో 16 నుంచి 25 ఏండ్ల యువతే ఎక్కువగా ఉన్నారు. డీ అడిక్షన్  సెంటర్​లో ఫ్యామిలీ మెంబర్స్  సమక్షంలో కౌన్సెలింగ్  ఇవ్వడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్  అందిస్తున్నాం. గంజాయి మత్తుకు అలవాటైతే ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసికంగా కుంగిపోతారు. కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. గంజాయి సేవిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాలి.- ‌‌‌‌‌‌‌‌ డాక్టర్  రామ్​నాయక్, సైకియాట్రిస్ట్, డీ అడిక్షన్  సెంటర్

కాలేజీలపై నిఘా పెట్టాం

జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో గంజాయి వినియోగిస్తున్న వారిని గతంలో పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్  ఇవ్వడంతో పాటు డీ అడిక్షన్  సెంటర్​కు పంపించాం. ఈ మధ్య డిగ్రీ కాలేజీల్లో గంజాయి దందా సాగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. పలు కాలేజీలపై నిఘా పెట్టాం. తల్లిదండ్రులు, లెక్చరర్లు విద్యార్థులపై ఓ కన్నేసి ఉంచాలి.
- ఏ.భాస్కర్, డీసీపీ, మంచిర్యాల