- ఆటోల ముసుగులో మధ్యవర్తుల దందా
- కూలీలను పెట్టుకొని లక్షల దోపిడీ
- పైసలు ఇస్తేనే చెత్త ఎత్తుడు..
- లేదంటే ఆ ఇంటి దిక్కు చూస్తలే!
- స్లమ్స్ లోకి రాకపోవడంతో రోడ్ల పక్కన వేస్తున్న జనం
- 2009 ఒప్పందం ప్రకారం రోడ్ల పై చెత్త లేకుండా చూడాల్సిన బాధ్యత రాంకీదే!
- మధ్యలో జీహెచ్ఎంసీ అధికారుల ఎంట్రీతో మారిన సీన్
- చెత్త సమస్యపై సీఎం సీరియస్
- ఆటో కార్మికులు, రాంకీ, అధికారులు కూర్చొని చర్చిస్తేనే కొలిక్కి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)లో చెత్త సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ఇండ్ల నుంచి చెత్త సేకరణ జరగకపోవడంతో రోడ్లపై పేరుకుపోతున్నది. అలాగే, గ్రేటర్లో చెత్త నిర్వహణ చూస్తున్న రాంకీ ఏజెన్సీ, ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో కార్మికుల మధ్య వార్‌తోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తమ తాత ముత్తాల నుంచి తామే చెత్త సేకరిస్తున్నామని.. ఇప్పుడూ తామే సేకరిస్తామని కార్మికులు చెబుతున్నారు. కానీ, వారు అపార్ట్ మెంట్లు, విల్లాలు, డబ్బులు ఎక్కువగా వచ్చే కాలనీల నుంచి మాత్రమే చెత్త సేకరిస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. స్లమ్స్ లోకి వెళ్లకపోవడంతో ఆ ప్రాంతాల వారు చెత్తని తెచ్చి గార్చేజ్ వర్నలబుల్ పాయింట్ల(జీవీపీ) వద్ద పారవేస్తున్నారు. 2016లో జీహెచ్ఎంసీ చేసిన తప్పుతో ఈ సమస్య ఏర్పడింది. అప్పట్లో ఓనర్ కమ్ డ్రైవర్ కింద స్వచ్ఛ ఆటోలను జీహెచ్ ఎంసీ అందించింది.
2016లో 2,500 వాహనాలు, 2019లో మరో
2 వేలు అందజేసింది. ఇందుకుగాను ఎస్సీ కార్మికుల నుంచి రూ.60 వేలు, బీసీల నుంచి రూ.80 వేలు డౌన్ పేమెంట్ కింద కార్మికుల నుంచి కలెక్ట్ చేసింది. నెలనెలా ఈఎంఐలు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లించింది. ఆటో కిస్తీ జీహెచ్ఎంసీ చెల్లిస్తున్నందున చెత్త సేకరణ కార్మికులు ప్రతి ఇంటి నుంచి రూ.50 తీసుకోవాలని అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ లో డోర్ టు డోర్ కలెక్ట్ నుంచి డంపిండ్ యార్డులో నిర్వహణ వరకు చేపట్టేలా 2009లో రాంకీతో జీహెచ్ఎం సీ ఒప్పందం చేసుకుంది. అయితే, ఒప్పంద ప్రకారం రాంకీతో అప్పటి నుంచి పనిచేయిస్తే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. అలాగే, 2016లో స్వచ్ఛ ఆటోలను కార్మికులకు ఇవ్వడంతో వారికి అధికారికంగా అప్పగించినట్టు అయ్యింది. అప్పట్లో ఉన్న కార్మికులతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. వాస్తవానికి అసలైన కార్మికులతో ఇబ్బందులు లేనప్పటికి, స్వచ్ఛ ఆటోలతో చెత్త సేకరణకి సంబంధించి దందాలు చేస్తున్న మధ్యవర్తులతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. చెత్త కనిపిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇచ్చిన ఆటోలకంటే ఫీల్డ్‌లో డబుల్..
జీహెచ్ఎంసీ 4,500 ఆటోలు అందిస్తే.. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో 10 వేలకుపైగా స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయి. ఈ స్వచ్ఛ ఆటోల ముసుగులో కొందరు మధ్యవర్తులు దందా కొనసాగిస్తున్నారు. ఆటోలను సొంతంగా కొనుగోలు చేసి డ్రైవర్లు, వర్కర్లని పెట్టి నడిపిస్తున్నారు. ఇందుకుగాను వారికి ఎంతో కొంత అందిస్తున్నారు. అయితే, ఆదాయం వచ్చే కాలనీల నుంచే చెత్తని తరలించాలని వారికి చెబుతున్నట్టు తెలిసింది. డబ్బులిస్తేనే చెత్త తీసుకెళ్తామని తేల్చిచెబుతున్నారు. అపార్ట్ మెంట్లు, విల్లాలు, కాలనీలు, బస్తీల్లోని చెత్త సేకరణకు కార్మికులు భారీగా వసూళ్లకు పాల్పతుండటం, వీరి మధ్యలో యూనియన్ల పేరిట కొందరు వ్యక్తులు జోక్యం చేసుకోవటంతో చెత్త సేకరణ ఓ దందాలా మారింది. ఇలా మధ్యవర్తులు ఒక్కో ఆటోపై నెలకి లక్షల్లో సంపాదిస్తున్నట్టు తెలిసింది. అలాగే, కొందరు వ్యక్తులు ఏరియాలను పంచుకొని ఆయా ప్రాంతాల్లో చెత్త కలెక్ట్ చేసేందుకు లక్షల రూపాయలు తీసుకొని ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛ ఆటోలకి సంబంధించి పెద్ద దందా కొనసాగుతున్నట్టు అధికారుల దృష్టికి కూడా వచ్చింది. క్రమంగా కార్మికులు చెత్త సేకరించేందుకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం మొదలుకావడంతో ఇదో దందాలా మారింది. ఇండ్ల కేటాయింపు విషయానికి సంబంధించి వివాదాలు తలెత్తి హత్యలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. నగరంలోని ఓ కాలనీని అల్లుడికి కట్నం కింద అప్పగించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ మధ్యవర్తుల అక్రమాలకు నిజమైన కార్మికులు నష్టపోతుండటంతో పాటు ప్రజలకు చెత్త సమస్య తీవ్రమైతున్నది.
రాంకీ ఒప్పందం ఇలా..
హైదరాబాద్ సిటీలోని ఇంటింటి నుంచి చెత్త సేక రణ, సెకండరీ ట్రాన్స్ పోర్టుతో పాటు జవహర్ నగర్ డంపింగ్ యార్డులో చెత్తను శాస్త్రీయంగా ల్యాండ్ ఫీల్ చేయాలని జీహెచ్ఎంసీ రాంకీ సంస్థతో 2009లో 25 ఏండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై తొలుత ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావటం, కొన్ని యూని యన్లు కోర్టును కూడా ఆశ్రయించటంతో తొలుత ఒప్పందాన్ని అధికారులు అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత 2012 తర్వాత అంచెలంచెలుగా రాంకీ ఒప్పందాన్ని అమలు చేస్తూ వచ్చారు. తొలుత ఒక మెట్రిక్ టన్నుకు రూ. 810 గా నిర్ణయించి, ఈ రేటును ప్రతి ఏటా 5 శాతానికి పెంచుతూ ప్రస్తుతం ఒక్క మెట్రిక్ టన్నుకు రూ. 2,110 చెల్లిస్తున్నారు. ఇలా డైలీ నగరంలో ప్రస్తుతం 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. డోర్ టూ డోర్ చెత్త సేకరణను ఒప్పందం ప్రకారం రాంకీ చేపట్టాల్సి ఉండగా, 2015లో అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్ చెత్తను త్వరితగతిన సేకరించి, ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందించారు.
కొత్త ఆటోలు ఇవ్వాలి..
ఇంటింటి నుంచి చెత్త సేకరించేందుకు స్వచ్ఛ ఆటో కార్మికు లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అంతటా కలెక్ట్ చేస్తున్నాం. స్వచ్ఛ ఆటో కార్మికులకు కొత్త ఆటోలు ఇవ్వాలి. ఎప్పుడో ఇచ్చినవి కావడంతో కొన్ని పూర్తిగా పాడయ్యాయి. కొత్త ఆటోలిస్తే మరిన్ని ఎక్కువగా ఇండ్ల నుంచి కలెక్ట్ చేయవచ్చు. అలాగే, ఇప్పటికే ఇచ్చిన 4,500 ఆటోల ఈఎంఐలను జీహెచ్ఎంసీ వెంటనే చెల్లించి కార్మికుల సిబిల్ స్కోర్ పై ఇబ్బంది లేకుండా చూడాలి. రాంకీ మా జోలికి రాకుండా చూడాలి. ఏండ్లుగా మా తాత ముత్తాల నుంచి చెత్తని సేకరిస్తున్నాం.
- రాజేందర్, తెలంగాణ స్వచ్ఛ
టిప్పర్ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్
సమస్యకి పరిష్కారం చూపాలి..
ఒకరిపైన ఒకరు చెప్పకుండా ముందుగా చెత్త సమస్యకి పరిష్కారం చూపాలి. రోడ్లపై ఎక్కడ కూడా చెత్త కనిపించ కుండా చేయాలి. అన్ని ఖర్చులు అవుతున్న కూడా ఎందుకు సమస్య పరిష్కారం కావడంలేదు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలి. అది మున్సిపాలిటీల బాధ్యత.
- పద్మనాభ రెడ్డి,
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్
రాంకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి..
రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం రద్దు చేసుకోవాలి. రాంకీ పనితీరు బాగలేకనే ఈ దుస్థితి ఏర్పడింది. రాంకీకి ప్రతి ఏటా రూ.400 కోట్లకి పైగా జీహెచ్ఎంసీ చెల్లిస్తున్నది. కానీ, ఇదే చెత్తని నేరుగా జీహెచ్ఎంసీ తరలిస్తే ఇందులో సగం కూడా ఖర్చు కాదు. రాంకీ ఒప్పందం రద్దు విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి.
- ఊదరి గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్
ఇలా చేస్తే సమస్యకి పరిష్కారం లభించే చాన్స్..
జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలు అందించిన 4,500 మంది కార్మికులతో ముందుగా చర్చించాలి. ఇప్పుడు మూడు కార్పొరేషన్లకి సంబంధించి పరిధి పెరిగింది. దీంతో కార్మికులు ఎంతమేర చెత్తని సేకరిస్తారనేదానిపై వారితోనే తెలుసుకోవాలి. ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తే ఒక్కొక్కరికి ఎంత పరిధి వస్తుందనేది తెలుసుకోవాలి. అలాగే, వారికి ఇచ్చే బెనిఫిట్స్ అందించడంతో పాటు వారి డిమాండ్లపై డిస్కస్ చేయాలి. వారు ఎంత మేర కలెక్ట్ చేస్తారో వారికే వదిలేసి మిగతా ప్రాంతాల్లో రాంకీతో కలెక్ట్ చేయించాలా? లేక జీహెచ్ఎంసీ నేరుగా సిబ్బందిని పెట్టి కలెక్ట్ చేయించాలా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలి. ఇలా స్వచ్ఛ ఆటో కార్మికులు, రాంకీ, జీహెచ్ఎంసీ అధికారులు కలిపి ఒక నిర్ణయానికి వచ్చి పనిచేస్తే చెత్త సమస్యకి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ విభజన తరువాత ముగ్గరు కమిషనర్లు స్వచ్ఛ ఆటో కార్మికులతో చర్చించారు. కానీ, చర్చలు పూర్తి స్థాయిలో జరగలేదు.
