బషీర్బాగ్, వెలుగు: గ్యాస్ సిలిండర్ పేలి ఓ వృద్ధురాలి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కాచిగూడకు చెందిన 70 ఏండ్ల సుమిత్ర తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు రావడాన్ని గమనించి వెంటనే బయటకు వచ్చి పక్కింటి యువకుడి సహాయం కోరింది. ఆ కొద్దిసేపటికే మంటలు ఉధృతమై సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
దీంతో సిమెంట్ రేకులతో ఉన్న ఇంటి పైకప్పు ఎగిరిపడటమే కాకుండా ఇంట్లోని సామగ్రి, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు నేలమట్టం కావడంతో ఆ వృద్ధురాలు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది.
