పద్మారావునగర్, వెలుగు: అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న మరో ముఠాను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. న్యూ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో మంగళవారం పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 7.50 లక్షల విలువైన 129 గ్యాస్ సిలిండర్లు, ఒక గూడ్స్ వాహనం, ఆక్టివా స్కూటర్, నాలుగు సెల్ ఫోన్లు, రూ. 26,700 నగదును స్వాధీనం చేసుకున్నారు.
భార్గవి గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్, మల్లేశ్.. ఏజెన్సీ యజమానికి తెలియకుండా మధ్యవర్తి నాగార్జున సాయంతో ఒక్కో సిలిండర్‌ను రూ. 5,000 వరకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి నుంచి సిలిండర్లు కొంటున్న టిఫిన్ సెంటర్ యజమాని నాగులపల్లి మల్లేశ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ (టాస్క్‌ఫోర్స్) గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, బోస్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
