
గచ్చిబౌలి, వెలుగు: యూటర్న్ వద్ద రెండు బైక్‌లపై వెళ్తున్న వారికి జరిగిన గొడవలో ఓ యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు. సోమాలియా దేశానికి చెందిన అహ్మద్(25) హిమాయత్ నగర్ లోని ఓ కాలేజీలో బీసీఏ సెకండియర్ చదువుతూ మాసబ్ ట్యాంక్ లో ఉంటున్నాడు. అదే దేశానికి చెందిన తన స్నేహితుడు యూనిస్ అబ్ది కరీం హసన్ ఒడిశాలో చవుకుంటున్నాడు. ఈయన కొన్ని రోజుల క్రితం అహ్మద్ వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి ఈ నెల 8న అర్ధరాత్రి బైక్ పై చాయ్ తాగేందుకు నాలెడ్జ్ సిటీకి వచ్చారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఐకియా వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, పక్కనే మరో బైక్పై వెళ్తున్న ఇద్దరితో గొడవ జరిగింది. దీంతో ఆ యువకులు తమ స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించారు. నలుగురు యువకులు కలిసి అహ్మద్, కరీంహసన్పై దాడికి దిగారు. ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో అహ్మద్ కడుపులో పొడిచి పరారయ్యాడు. అహ్మద్ ను మాదాపూర్ లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటున్నాడు. రాయదుర్గం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.