
వెలుగు: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్–2019) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి . ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. స్కోర్ కార్డులు ఈనెల 20 నుంచి మే 31వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఈ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థి తన సత్తా చాటాడు. ఖమ్మం జిల్లా రాములుతండాకు చెందిన దేవిలాల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించాడు. దేవిలాల్ ప్రస్తుతం ఐఐటీ రూర్కీలో ఎంటెక్ పీహెచ్‌డీ ఇంట్రిగ్రేటేడ్ కోర్సు చేస్తున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి పలు బ్రాంచుల్లో విద్యార్థుల కటాఫ్ మార్కు లు భారీగా పెరిగాయి. ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్‌లో గతేడాది ఓపెన్ కేటగిరిలో 29.1 మార్కులు ఉండగా, ఈసారి 39.6 మార్కులకు, సివిల్ విభాగంలో గతేడాది కటాఫ్ మార్కులు 26.90 ఉండగా, ఈ సంవత్సరం 28.2 కి పెరిగాయి. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో గతేడాది కటాఫ్ మార్కు లు 34.7 కాగా.. ఈఏడాది34.1, కంప్యూటర్ సైన్స్‌లో గతేడాది 25 మార్కులుం డగా.. ఈసారి కటాఫ్ మార్కు లు 29.5 కి పెరిగాయి.