చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‎గా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‎గా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి

న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో అత్యున్నత పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‎గా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీడీఎస్‌‌ జనరల్‌‌ అనిల్‌‌ చౌహాన్‌‌ పదవీకాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో పాకిస్తాన్, చైనా సరిహద్దుల వ్యవహారాల్లో అపారమైన అనుభవం, వ్యూహాత్మక చతురత కలిగిన సుబ్రమణి ఆదివారం నియమితులయ్యారు. 

ఈ సందర్భంగా జనరల్ సుబ్రమణి మాట్లాడుతూ.. ‘‘భారత సాయుధ దళాల ఆధునికీకరణ, సంస్కరణల ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌‌ల మధ్య సమన్వయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడమే నా మొదటి ప్రాధాన్యత. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఆయుధాల అభివృద్ధిని, వాటిని త్రివిధ దళాల్లోకి చేర్చుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాం. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంలో మన దళాలు ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తాయి’’ అని  పేర్కొన్నారు. 

మాజీ సైనికులు, వీరనారుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. దేశ భద్రత బలోపేతానికి యావత్ భారతదేశం ఏకతాటిపై నిలిచిందని అన్నారు. కాగా, దాదాపు 40 ఏండ్లకుపైగా దేశ రక్షణ కోసమే  జనరల్ సుబ్రమణి ప్రస్థానం సాగింది. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లలో ఆయన కీలక పాత్ర పోషించారు.