గూఢచర్యం ఆరోపణలతో జర్మనీలో ఇండియన్ పై కేసు

గూఢచర్యం ఆరోపణలతో జర్మనీలో ఇండియన్ పై కేసు

బెర్లిన్: గూఢచర్యం జరిపాడన్న కారణంతో ఇండియాకు చెందిన ఓ వ్యక్తిపై జర్మనీ ప్రాసిక్యూటర్లు కేసు వేశారు. తన దేశ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోసం జర్మనీలో ఉంటున్న సిక్కు కమ్యూనిటీతోపాటు కశ్మీర్ కార్యకర్తలపై రెండేళ్ల పాటు ఆ వ్యక్తి గూఢచర్యం జరిపాడన్నది అభియోగం. ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం సదరు వ్యక్తిపై నేరానికి పాల్పడ్డాడని ఆరోపించింది. నిందితుడిని ఎస్. బల్వీర్ గా గుర్తించామని తెలిపింది. తమ దేశ ప్రైవసీ రూల్స్ కు అనుగుణంగా ఫ్రాంక్ ఫర్ట్ లోని స్టేట్ కోర్టులో బల్వీర్ పై కేసు ఫైల్ చేశామని పేర్కొంది.

ప్రాసిక్యూటర్స్ ప్రకారం.. జర్మనీలోని సిక్కులు, కశ్మీరీ యాక్టివిస్ట్ లతోపాటు వారి బంధువుల సమాచారాన్ని 2015 జనవరి కంటే ముందు లేదా తర్వాత ఇండియాస్ రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పని చేసే ఓ ఉద్యోగికి బల్వీర్ చేరవేశాడు. జర్మనీ బేస్డ్ గా పని చేస్తున్న ఇంటెలిజెన్స్ సదరు ఆఫీసర్ తో బల్వీర్ రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండేవాడు. 2017 డిసెంబర్ దాకా చాలా కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఆఫీసర్ కు బల్వీర్ అందించేవాడు. అయితే బల్వీర్ ను కస్టడీలోకి తీసుకున్నారా లేదా అనే దానిపై జర్మనీ ప్రాసిక్యూటర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.