హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో విలీనమైన వివిధ మున్సిపాలిటీల్లో అనధికార ప్రకటనలు ఉన్నట్లు గుర్తించామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం తెలిపారు. మున్సిపల్ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో అనధికార ప్రకటనలను గుర్తించి తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే పలు అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లు తదితర అనధికార ప్రకటనలను తొలగించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజా భద్రత, నగర సుందరీకరణను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధి అంతటా ఈ డ్రైవ్‌ను దశలవారీగా, నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనధికార ప్రకటనలపై పర్యవేక్షణ, నియంత్రణ, చర్యల కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకటనదారులు, ప్రకటన ఏజెన్సీలు, భవన యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ప్రకటనలు ఏర్పాటు చేయాలని సూచించారు.
