ఎలక్షన్​ డ్యూటీలో ఆశాలు, అంగన్ వాడీలు

V6 Velugu Posted on Dec 01, 2020

ట్రైనింగ్​ లేదు.. అప్పటికప్పుడు జిల్లాల నుంచి రప్పించారు

ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతోనే ఈ సమస్య

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​ డ్యూటీకి  ప్రభుత్వ ఉద్యోగులు పెద్దగా ముందుకు రాకపోవడంతో అప్పటికప్పుడు జిల్లాల్లోని ఆశా వర్కర్లు, అంగన్​ వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ట్రైనింగ్‌‌ లేకుండానే వాళ్లను ఎలక్షన్​ డ్యూటీకి పంపారు. ఏం తెల్వకుండా డ్యూటీ ఎట్ల చెయ్యాలని, పైగా బ్యాలెట్​ విధానం కావడంతో ఎట్ల అని వాళ్లు ఆఫీసర్ల ముందు వాపోయారు. సోమవారం గ్రేటర్‌‌లోని ప్రతి డిస్ట్రిబ్యూషన్‌‌ అండ్​ రిసీవింగ్​ సెంటర్​(డీఆర్‌‌సీ)లో  ఇదే పరిస్థితి కనిపించింది. రిటర్నింగ్‌‌ ఆఫీసర్లు ఏదో విధంగా నచ్చజెప్పి వాళ్లను డ్యూటీలకు పంపించారు. ఎలక్షన్​ డ్యూటీ కోసం వివిధ శాఖల నుంచి 48 వేల మంది ఉద్యోగులను కొన్నిరోజుల కింద ట్రైనింగ్​కు పిలిస్తే 60 శాతం మంది మాత్రమే అటెండయ్యారు. అందులోనూ 50 శాతం మంది అసలు టైమ్‌‌కు డ్యూటీకి రాలేమని చేతులెత్తేశారు. డ్యూటీ వద్దనుకున్న వాళ్లలో సిటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు.ఒక వైపు కరోనా భయం, మరోవైపు బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ విధానం వల్ల రిగ్గింగ్‌‌‌‌‌‌‌‌ జరిగి గొడవలవుతాయేమోనన్న టెన్షన్‌‌‌‌‌‌‌‌తో డ్యూటీలు మానుకున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు వెంటనే వాట్సప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్​ పెట్టి ఉమ్మడి వరంగల్, మహబూబ్​నగర్, నల్గొండ జిల్లాల్లోని పంచాయతీ సెక్రటరీలు, ఆశా, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ వర్కర్లను డ్యూటీకి పిలిపించారు.

డీఆర్​సీ సెంటర్లలో టెన్షన్​

ఎన్నికల కోసం గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 30 డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ రిసీవింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు(డీఆర్‌‌‌‌‌‌‌‌సీ) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నుంచి  స్టాఫ్​కు సోమవారం ఎలక్షన్​ మెటీరియల్​ అందజేశారు. అయితే ఏవీ కాలేజీ, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం డీఆర్​సీల నుంచి  మెటీరియల్​ అందజేస్తుండగా.. ఆశా, అంగన్​వాడీ స్టాఫ్​ కూడా డ్యూటీలో జాయినయ్యేందుకు వెనుకాడారు. ఉదయం పదకొండు, పన్నెండు గంటలైనా అందరూ రాకపోవడం, వచ్చిన వాళ్లలో చాలా మంది బాధ్యతలు తీసుకోకపోవడం చూసి ఆఫీసర్లు టెన్షన్​ పడ్డారు. డ్యూటీలో జాయిన్‌‌‌‌‌‌‌‌ కావాలని మైకుల్లో అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు చేయాల్సి వచ్చింది. తాము డ్యూటీ సరిగ్గా చేయగలుగుతామా..? గొడవలు ఏమైనా జరుగుతాయా..? కరోనా ప్రమాదం ఏమీ ఉంటుందా..? అంటూ ఆశా, అంగన్​వాడీ స్టాఫ్​ చర్చించుకోవడం కనిపించింది. కొందరు తమకు రిస్క్​ లేని ప్రిసైడింగ్​ ఆఫీసర్​ డ్యూటీ వేస్తే బాగుండని మాట్లాడుకున్నారు. ఆ డ్యూటీ దక్కని వాళ్లు కొందరు వెనక్కి వెళ్లిపోయారు. గ్రేటర్ ఎన్నికల కోసం  9,101 పోలింగ్ సెంటర్లకు అన్ని శాఖల నుంచి 48 వేల మందిని నియమించాలని ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. కానీ, తాజాగా జీహెచ్ ఎంసీ ఆఫీసర్లు  36,404 మంది పోలింగ్ డ్యూటీ చేస్తున్నట్లు చెప్పారు.

ట్రైనింగ్​ లేదు.. ఎట్ల డ్యూటీ చెయ్యాలె?

రెండు రోజుల కింద సిబ్బంది తక్కువ ఉన్నారని గ్రహించిన ఆఫీసర్లు వరంగల్ , మహబూబ్ నగర్ ఇతర సమీప జిల్లాల నుంచి స్టాఫ్​ను పిలిపించారు. అయితే వీరికి జిల్లాల్లో 3, 4 గంటలు నామ్ కే వాస్తే గా ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ కు వెళ్లాలని చెప్పినట్లు ఓ ఉద్యోగి అన్నారు. ‘‘నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న. గతంలో ఎప్పుడూ ఎన్నికల డ్యూటీ చేయలేదు. ఇటీవల గ్రేటర్ డ్యూటీకి హాజరుకావాలని వాట్సప్ లో ఆఫీసర్లు సమాచారం అందించారు. ఎటువంటి  ట్రైనింగ్ నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల డ్యూటీ వేసిండ్రు. మంగళవారం ఎన్నికల డ్యూటీ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు.  నాతో పాటు మా జిల్లా నుంచి చాలా మందిని గ్రేటర్ ఎన్నికల కోసం పిలిపించారు. ఇక్కడ అధికారులను ట్రైనింగ్ గురించి అడిగితే ఏం చెప్పడంలేదు’’ అని ఏవీ కాలేజీలో  ఎలక్షన్​ మెటీరియల్​ కోసం వచ్చిన ఓ మహిళ ఉద్యోగి చెప్పారు. ‘‘ఎన్నికల డ్యూటీ కోసమని మమ్నల్ని పిలిపించారు. మాకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. పైగా బ్యాలెట్​ విధానం. మాకు అర్థం కావడం లేదు. ఏదైనా గొడవ జరిగితే మా ఉద్యోగాలకు ఇబ్బందైతది” అని షాద్ నగర్ , అమన్ గల్  నుంచి వచ్చిన అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు -అన్నారు.

ఐడీ కార్డుల్లో ఫొటోల్లేవ్​

హడావుడిగా పంచాయతీ కార్యదర్శులను, ఆశా వర్కర్లను ఎలక్షన్​ డ్యూటీ కోసం  పిలిచిన ఆఫీసర్లు.. వారిలో కొందరికి ఫొటోలు లేకుండానే ఎలక్షన్​ ఐడీ కార్డులు జారీ చేశారు. ఎలక్షన్‌‌‌‌ డ్యూటీకి వచ్చేటప్పుడు ఫొటోలు తెచ్చుకోవాలని తమకు చెప్పలేదని ఆ ఉద్యోగులు అన్నారు.

Tagged latest, ghmc, update, ELECTIONS, election, on, duty, anganwadi activists, asha activists

Latest Videos

Subscribe Now

More News