- మెరుగైన సేవల కోసమే జీహెచ్‌ఎంసీ విలీనం: మంత్రి శ్రీధర్ బాబు
- ఒకే పన్ను విధానం, సుస్థిరాభివృద్ధి కోసమే విలీనం
- కార్పొరేషన్ల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలే
- భవిష్యత్‌లో సిటీ శివార్లలో జనసాంద్రతను దృష్టిలోపెట్టుకొని వార్డుల విభజన
- సిటీని 360 డిగ్రీలు కవర్‌చేసేలా మెట్రో విస్తరిస్తాం
- జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో మంత్రి
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఇదివరకు పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీ చట్టం, జీహెచ్‌ఎంసీ యాక్ట్ అని మూడు ఉండేవని, ఫలితంగా విభజిత పాలన జరిగేదన్నారు.
అందుకే అన్నింటినీ కలిపి ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించామని, అందుకే జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేయాలని నిర్ణయించామన్నారు. మళ్లీ దానిని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలన్నది నిర్ణయం తీసుకోలేదన్నారు. మూడు కార్పొరేషన్లా.. నాలుగు కార్పొరేషన్లా అన్నది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై సభ్యుల అనుమానాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా రీసోర్స్ పూలింగ్‌కు అవకాశం దొరుకుతుందని, ఆర్థిక వనరులు పెరుగుతాయన్నారు. సిటీ మొత్తాన్ని ఏకీకృతం చేసి మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అయితే, జీహెచ్‌ఎంసీ విస్తరణ కేవలం ఓఆర్‌ఆర్ పరిధి వరకే ఉంటుందని, భవిష్యత్‌లో మరింత విస్తరించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఒకే పన్ను విధానం తీసుకొస్తామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను మార్పులేవీ ఉండబోవని, భవిష్యత్‌లో మార్పులు చేయాల్సి వస్తే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ప్రజలపై అదనపు భారం ఉండబోదని స్పష్టం చేశారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదని, అలాంటప్పుడు బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజాస్వామికంగా చర్చ చేసినం..
జీహెచ్‌ఎంసీ చట్ట సవరణపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగలేదని ప్రతిపక్షాలు అనడంలో నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ మీటింగ్‌లో దీనిపై విస్తృతంగా చర్చ జరిపామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనల ప్రకారం టేబుల్ ఐటెం పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. విలీన ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో అధ్యయనం చేయించామని, ప్రజల అభిప్రాయాలూ తీసుకున్నామన్నారు.
5,935 సూచనలు వచ్చాయని, అందులో 25 శాతం సూచనలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభాతో పాటు.. ఇప్పటివరకు పెరిగిన జనాభాపై స్టడీ చేయించి, దానికి అనుగుణంగానే డీలిమిటేషన్ చేస్తున్నామని తెలిపారు. అప్పుడు సిటీ జనాభా 78 లక్షలని, ఇప్పుడు 1.34 కోట్లకు పెరిగిందని చెప్పారు. భవిష్యత్ జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని వార్డుల విభజన జరిగిందని మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే కోర్ అర్బన్ ఏరియాలోని శివార్లలో జనాభా పెరుగుతున్నదని, భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగానే వార్డుల విభజన చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో వార్డుల సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే 8 మంది జోనల్ కమిషనర్లను నియమించామని, హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇద్దరు ఐఏఎస్‌లను కేటాయించామన్నారు. గత ప్రభుత్వం సిబ్బందిని నియమించకుండానే జిల్లాలను 33కి పెంచిందని, కలెక్టరేట్లను నిర్మించినా సిబ్బందిని నియమించలేదని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో ఆందోళనకరంగా గాలి నాణ్యత..
హైదరాబాద్ సిటీలో గాలి నాణ్యత ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం సిటీలో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీఇండెక్స్) 174గా నమోదైందని చెప్పారు. అందుకే సిటీలో పొల్యూషన్ లేకుండా ఉండేందుకు నెట్ జీరో పాలసీ, హిల్ట్ పాలసీ వంటి వాటిని తీసుకొస్తున్నామన్నారు. సిటీ లోపలి ఇండస్ట్రీలతో పొల్యూషన్ ప్రభావం ఉంటుందని, వాటిని సిటీ అవతలికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
భవిష్యత్‌లో సిటీలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్రం కేటాయిస్తున్న బస్సుల కన్నా ఎక్కువ సంఖ్యలో కేటాయించాలని కోరుతున్నామన్నారు. అంతేగాకుండా హైదరాబాద్‌ను 360 డిగ్రీలూ కవర్ చేసేలా మెట్రోను విస్తరిస్తున్నామని చెప్పారు. అనుమతులు, నిర్వహణలో సమస్యలు రాకుండా ఉండేందుకే ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లా జిల్లా అస్థిత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన హామీ ఇచ్చారు.
మూడు కార్పొరేషన్లకు ఏం పేర్లు పెట్టారు?: దానం నాగేందర్
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించారని, వాటికి ఏం పేర్లు పెట్టారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 12 జోన్లుగా విభజించారని, దాని వల్ల కలిగే లాభాలేంటన్నారు. వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ వీటిలో కలుపుతున్నారా.. లేదంటే ప్రత్యేకంగానే ఉంచుతున్నారా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో వేటిని విలీనం చేస్తున్నారు.. వేటినిసెపరేట్ చేస్తున్నారో చెప్పాలని కోరారు.
