జనగణనకు జీహెచ్ఎంసీ రెడీ.. ఏప్రిల్ 26 నుంచి ఆన్ లైన్ ద్వారా ఇండ్ల నమోదుకు ఛాన్స్..

జనగణనకు జీహెచ్ఎంసీ రెడీ.. ఏప్రిల్ 26 నుంచి ఆన్ లైన్ ద్వారా ఇండ్ల నమోదుకు ఛాన్స్..
  • ఈనెల 26 నుంచి ఆన్​లైన్ ద్వారా  ఇండ్ల నమోదుకు ఛాన్స్​ 
  • మే 11 నుంచి జూన్ 9 వరకు 
  • ‘క్యూర్’ లో ఇండ్ల లెక్క తేలుస్తరు 
  • మొత్తం బాధ్యతలు జీహెచ్ఎంసీకే  23,549 మంది 
  • ఎన్యుమరేటర్లు నియామకం 
  • ఒక్కొక్కరికి 200 నుంచి 300 ఇండ్ల బాధ్యతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జనగణన ప్రక్రియ మొదటి దశను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మూడు కార్పొరేషన్లలోని కోర్ అర్బన్ రీజియన్​(క్యూర్) పరిధిలో జనగణనను నిర్వహించే బాధ్యతలను జీహెచ్ఎంసీకే అప్పగించడంతో ఏర్పాట్లు చేస్తోంది. క్యూర్ పరిధిలో మే11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లనున్నారు. అంతకు ముందు ఏప్రిల్ 26 నుంచి ప్రజలు తమతంట తాముగా ఆన్‌‌లైన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. 

మే 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయన్నది గుర్తిస్తారు. వీటితో పాటు ఇంటి ఓనర్ వివరాలు తీసుకుంటారు. క్యూర్ లిమిట్స్ లో దాదాపు 50 లక్షల వరకు ఇండ్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లే ఎన్యుమరేటర్లు అక్కడ ఒక ప్రత్యేకమైన ‘హౌస్ లిస్టింగ్ బ్లాక్ నెంబర్’ కేటాయిస్తారు.  

23వేల మంది ఎన్యుమరేటర్లు...

క్యూర్ పరిధిలో సెన్సస్ కోసం 23,549 మంది ఎన్యుమరేటర్లను జీహెచ్​ఎంసీ నియమించనున్నది. ఇందులో టీచర్లు, ఇతర డిపార్టుమెంట్లకి సంబంధించిన ఉద్యోగులు ఉండనున్నారు. ఎన్యుమరేటర్ల ఎంపిక తర్వాత వారికి శిక్షణ ఇచ్చి సర్వేకి పంపిస్తారు. ఒక్కో ఎన్యుమరేటర్ కి  200 నుంచి 300 ఇండ్ల సర్వే బాధ్యతలను అప్పగిస్తారు. ఇండ్ల సర్వే పూర్తయిన తర్వాత, జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉండనున్నది. అప్పుడే  పూర్తి వివరాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కులాలకి సంబంధించిన వివరాలు రికార్డుల్లోకి
 ఎక్కిస్తారు.