
- ఇకపై ఓఆర్‌ఆర్ వరకు బల్దియా వెలుగులు
- స్ట్రీట్ లైట్ల నిర్వహణ జీహెచ్‌ఎంసీకి అప్పగింత
- ఇప్పటికే గ్రేటర్లో దాదాపు 5 లక్షల స్ట్రీట్లు లైట్లు
- శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2 లక్షలు
- ఇకపై 7 లక్షల స్ట్రీట్లైట్ల బాధ్యతలు చూడనున్న బల్దియా
- ఎలా నిర్వహణ చేయాలని ఓయూ స్టడీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వరకు స్ట్రీట్ లైట్ల బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా శివారులోని 7 కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఇకపై బల్దియానే చూడనుంది.
గ్రేటర్ పరిధిలో దాదాపు 5 లక్షల స్ట్రీట్ లైట్లు ఉండగా, శివారు మున్సిపాలిటీల్లో దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని స్ట్రీట్ లైట్లను ఐదేండ్లపాటు నిర్వహణ కోసం రూ. 693 కోట్లతో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది.
ఇందుకు మెరుగైన విధానాలతో ఐదు ప్రముఖ సంస్థలు ముందుకు రాగా, ఆ సంస్థలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించి బాధ్యతలను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ ప్రక్రియ కొనసాగతుండగానే ఓఆర్ఆర్ వరకు నిర్వహణ అంశం తెరపైకి వచ్చింది.
ఓఆర్ఆర్ వరకు ఒక్క సంస్థనే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే స్ట్రీట్ లైట్ల సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో నిర్వహణ ఎలా చేయాలన్న దానిపై ఉస్మానియా యూనివర్సిటీతో ప్రభుత్వం స్టడీ చేయిస్తున్నది. స్టడీ పూర్తయిన తరువాత నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
సోలార్ సిస్టం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు
గ్రేటర్పరిధిలోని స్ట్రీట్ లైట్లు సోలార్ పవర్ తో వెలిగేలా జీహెచ్ఎంసీ మార్గాన్ని అన్వేషిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని 650 కి.మీ. విస్తీర్ణంలో 3.90 లక్షల స్తంభాలు ఉండగా, 8,733 కి.మీ. పొడువున విద్యుత్ వైర్లున్నాయి. 4.77 లక్షల స్ట్రీట్ లైట్లు ఉండగా, వీటి నిర్వహణకు మొత్తం 24,840 సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) బాక్సులున్నాయి.
వీటిలో లైట్లు ఆటోమెటిక్ గా సాయంత్రం ఆరు గంటలకు ఆన్ అయి ఉదయం ఆరు గంటల వరకు వెలిగేలా, ఆఫ్ అయ్యేలా 6,786 టైమర్ బోర్డులున్నాయి. నెలకు రూ.8 కోట్ల కరెంటు బిల్లులు వస్తుండగా, ఎంతో కొంత తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సోలార్ విధానాన్ని అమలు చేసే విషయంపై ఆలోచిస్తుంది.
స్ట్రీట్ లైట్లన్నింటికీ సోలార్ ప్లేట్లను అమర్చి, అవి వెలిగేలా చేసే సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా గ్రేటర్ పరిధిలో అమలు చేసి ఆ తరువాత ఔటర్ వరకు సోలార్ విధానాన్ని అమలు చేసే అవకాశముంది.