మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన గిగ్ వర్కర్లు

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన గిగ్ వర్కర్లు
  •     గిగ్ వర్కర్ల బిల్లును స్వాగతిస్తున్నాం
  •     టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ 
  •     చట్టం కోసం తమ సూచనలు పరిగణనలోకి తీసుకోండి
  •     మంత్రిని కోరిన టీజీపీడబ్ల్యూయూ నేతలు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు –2026 ను స్వాగతిస్తున్నామని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. లక్షలాది మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఈ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలంటే బిల్లులోని కొన్ని నిబంధనలపై మరింత స్పష్టత అవసరమని చెప్పారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో  కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని సలావుద్దీన్ తోపాటు యూనియన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి అందజేశారు. అనంతరం షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు కనీస వేతన చట్టం-1948 కంటే తక్కువగా ఉండకూడదన్నారు. పని స్వభావం, నైపుణ్యం ఆధారంగా వేతన వర్గీకరణ ఉండాలని, అప్పుడే గిగ్ కార్మికులకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సవరణలను పరిశీలించి కార్మికుల హక్కులను పటిష్టం చేసే విధంగా తుది చట్టాన్ని రూపొందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

దీంతోపాటు బిల్లులోని సెక్షన్ 2(ఎం)లో ఉన్న ‘ప్లాట్‌ఫామ్ వర్క్’ నిర్వచనం గందరగోళానికి దారితీసేలా ఉందని, దానిని తొలగించాలన్నారు. సంక్షేమ బోర్డు నిర్మాణంలో మహిళా గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కనీసం ఒక మహిళా ప్రతినిధిని తప్పనిసరిగా నియమించాలని సూచించారు. బోర్డు పనితీరులో పారదర్శకత కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలని, కనీసం 1/3 వంతు కోరం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా అగ్రిగేటర్లు తమ వద్ద ఉన్న గిగ్ వర్కర్ల డేటాను బోర్డుకు సమర్పించేలా నిబంధన ఉండాలని మంత్రిని కోరారు. తమ సలహాలు, సూచనలపై మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి చట్టంలో సవరణలు చేసేలా చొరవ చూపుతానని హామీ ఇచ్చినట్లు సలావుద్దీన్ తెలిపారు.