
లండన్: చివరి రెండు టెస్టుల మధ్య మూడు రోజుల విరామం మాత్రమే రావడంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్నప్పుడు మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ఇది చాలా తక్కువ గ్యాప్ అన్నారు. బౌలర్లపై ఎక్కువ భారం పడుతున్నందున మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలని సూచించారు.
లీడ్స్, లార్డ్స్‌లో జరిగిన తొలి, మూడో టెస్ట్‌ల మధ్య వారం రోజుల విరామం లభించింది. కానీ రెండు, నాలుగో మ్యాచ్ మధ్య మాత్రం వరుసగా ఐదు, మూడు రోజుల గ్యాపే ఉండటం చర్చకు దారి తీసింది. ఐదు రోజులు పూర్తి టైమ్ మ్యాచ్ జరగడంతో ప్లేయర్లు కోలుకోవడం చాలా కష్టంగా మారిందని గిల్ అన్నాడు.
‘ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఐదు రోజులు సాగింది. చివరి సెషన్ వరకూ ఆడాం. గతంలో చివరి సెషన్ వరకు ఆడిన సిరీస్ నాకైతే గుర్తు లేదు. కాబట్టి ఇలా ఆడటం చాలా కష్టం. రెండు జట్లు ఇంత కఠినమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు మూడు రోజుల విరామం చాలా తక్కువ. ప్రతి మ్యాచ్‌కు ఐదు, ఆరు రోజులు ఇస్తే టూర్ కూడా చాలా పొడవుగా సాగుతుందని మేం అర్థం చేసుకుంటాం. కానీ దీనిపై బోర్డులు దృష్టి పెట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి’ అని గిల్ పేర్కొన్నాడు.
ఇక గంభీర్, క్యూరేటర్ ఫోర్టిస్ వివాదంపై కూడా గిల్ స్పందించాడు. పిచ్‌ను చూసే హక్కు కోచ్‌కు ఉంటుందని గౌతీకి మద్దతుగా నిలిచాడు. ‘నిన్న జరిగిన గొడవ అనవసరం. కాకపోతే పిచ్‌ను పరిశీలించే హక్కు కోచ్‌కు కచ్చితంగా ఉంటుంది. క్యూరేటర్ ఎందుకు అనుమతించలేదో నాకు అర్థం కాలేదు. స్పైక్స్ లేకుండా వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అతను ఎందుకు అలా చేశాడో తెలియదు. గత నాలుగు టెస్ట్‌ల్లో ఎప్పుడు ఇలా జరగలేదు’ అని కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు టైట్ షెడ్యూల్ వల్ల బౌలర్లు కోలుకోవడానికి చాలా తక్కువ టైమ్ లభిస్తుందన్నాడు. ‘ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్‌కు గ్యాప్ ఎక్కువగా ఉంటే బాగుండేది. రెండుసార్లు ఎనిమిది, తొమ్మిది రోజుల విరామం కంటే అన్ని మ్యాచ్‌ల మధ్య ఐదు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేయాలి. రెండు జట్లకు ఈ షెడ్యూల్ కష్టంగానే ఉంది. బౌలర్లు చాలా ఓవర్లు వేయాలి. ఎక్కువసేపు ఫీల్డ్‌లోనే గడపాల్సి వస్తుంది’ అని స్టోక్స్ వ్యాఖ్యానించాడు.