
హైదరాబాద్, వెలుగు: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు కూడా అవకాశమివ్వాలని కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంగళవారం లెటర్ రాశారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతోపాటు ఇగ్నో/మెడికల్ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హులుగా ప్రకటించారని తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్, బీయూఎం ఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులు మెడిసిన్ గ్రాడ్యుయేట్ కోర్సులేనని మంత్రి గుర్తుచేశారు. ఆయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి.. సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల అభ్యర్థులను విస్మరించడం సరికాదన్నారు. నిబంధనలను సవరించి వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు.