గ్లోబల్‌‌‌‌ బ్రాండ్లతో దేశీయ కంపెనీల పార్ట్​నర్‌‌‌‌షిప్

గ్లోబల్‌‌‌‌ బ్రాండ్లతో దేశీయ కంపెనీల పార్ట్​నర్‌‌‌‌షిప్

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: గ్లోబల్‌‌గా పాపులర్ అయిన లగ్జరీ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి. దేశంలో లగ్జరీ బ్రాండ్లకు డిమాండ్ పెరగడంతో  లోకల్ కంపెనీలు ఇంటర్నేషనల్ బ్రాండ్లతో టై అప్ అవుతున్నాయి. వీటి ప్రొడక్ట్‌‌లను ఇండియాకు తెస్తున్నాయి. ఫ్యాషన్ సెక్టార్‌‌‌‌లో బిజినెస్ చేస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్  రిటైల్ (ఏబీఎఫ్‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌) తాజాగా ఫ్రెంచ్ లగ్జరీ రిటైల్ కంపెనీ గ్యాలరీల సైయెట్‌‌తో పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకుంది.

ఈ సంస్థతో కలిసి దేశంలో అల్ట్రా లగ్జరీ, లగ్జరీ స్టోర్లను ఏర్పాటు చేయనుంది.ఈ స్టోర్లను ముంబై, ఢిల్లీలలో ఏర్పాటు చేయనుండగా,  ఇక్కడ 200 కి పైగా లగ్జరీ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని అంచనా. పారిస్‌‌, షాంఘై, లక్సంబర్గ్‌‌ సిటీలలో  గ్యాలరీల సైయెట్‌‌ రిటైల్ స్టోర్లు ఉన్నాయి. అర్మానీ, బూలెన్‌‌సీగ్‌‌, బర్బెర్రీ, బల్గరీ, కాల్విన్‌‌ క్లైన్‌‌, సెలిన్‌‌, క్రిస్టియన్ డీవ్‌‌, లూయివూటన్‌‌, ప్రాడా వంటి అల్ట్రా లగ్జరీ బ్రాండ్లను ఈ కంపెనీ అమ్ముతోంది.

ఇండియాలో కస్టమైజ్డ్‌‌ ప్రొడక్ట్‌‌లను అందించేందుకు   లగ్జరీ బ్రాండ్‌‌  బూలెన్‌‌సీగ్‌‌తో రిలయన్స్ రిటైల్ పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అపారల్‌‌, ఫుట్‌‌వేర్‌‌‌‌, యాక్సెసరీలను అమ్మే ఇంటర్నేషనల్  బ్రాండ్‌‌ రివోల్వ్‌‌ను  కిందటి నెల నుంచి నైకా  కస్టమర్లకు అందుబాటులో ఉంచుతోంది. ఇప్పటికే దేశంలో తమ ప్రొడక్ట్‌‌లను అమ్ముతున్న లగ్జరీ బ్రాండ్లు కేవలం ఇండియన్ మార్కెట్‌‌ను దృష్టిలో పెట్టుకొని ప్రొడక్ట్‌‌లను తీసుకొస్తున్నాయి. వెడ్డింగ్ సీజన్ కావడంతో ఈ నెల ప్రారంభంలో రూ.75,000– రూ.1.20 లక్షల రేంజ్‌‌లో లిమిటెడ్ ఎడిషన్ ఫుట్‌‌వేర్‌‌‌‌ను లూయివూటన్‌‌ లాంచ్ చేసింది.

టేకాఫ్‌‌కు రెడీ..

దేశంలో లగ్జరీ బ్రాండ్లకు డిమాండ్ ఉందని, వైట్‌‌ కాలర్ ఉద్యోగుల ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్ పెరగడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. బిజినెస్‌‌ను విస్తరించడానికి  స్టోర్లను ఏర్పాటు చేయడం,  బ్రాండ్లను అందుబాటులో ఉంచడం వంటివి చేస్తున్నామని కొన్ని కంపెనీలు పేర్కొన్నాయి. లగ్జరీ బ్రాండ్లు 20‌‌‌‌00 వ సంవత్సరం నుంచి దేశంలో అందుబాటులో ఉన్నాయి. డిమాండ్ లేకపోవడంతో  కొన్ని  తమ బిజినెస్‌‌లను  క్లోజ్ చేసేశాయి  కూడా.  ప్రస్తుతం పరిస్థితులు మారాయి.

బిజినెస్‌‌లు చేసే వారు పెరగడం, సోషల్ మీడియా విస్తరించడం వంటి అంశాలు  బ్రాండెడ్ ప్రొడక్ట్‌‌ల డిమాండ్‌‌ను పెంచుతున్నాయి. ‘గత 15 ఏళ్ల నుంచి దేశంలో లగ్జరీ మార్కెట్‌‌ నిలకడగా ఉంది.  ప్రస్తుతం ఈ మార్కెట్ టేకాఫ్‌‌ అవ్వడానికి రెడీగా ఉంది. దీన్ని  ఏబీఎఫ్‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌, రిలయన్స్ రిటైల్ వంటి కంపెనీలు గుర్తించాయి’ అని కన్సల్టింగ్ కంపెనీ వజీర్ అడ్వజైర్స్‌‌ ఎండీ హర్మిందర్ సాహ్ని అన్నారు.

పెద్ద కంపెనీలు లగ్జరీ బ్రాండ్లతో తమ పోర్టుఫోలియోను విస్తరిస్తున్నాయని,  గ్లోబల్‌‌ బ్రాండ్లు లోకల్‌‌గా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. 2019 నుంచి చూస్తే ఏబీఎఫ్‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌, రిలయన్స్ రిటైల్ వంటి పెద్ద కంపెనీలు  20 కి పైగా బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడమో లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయడం వంటివి చేశాయి. వీటిలో మెజార్టీ బ్రాండ్‌‌లు లగ్జరీ సెగ్మెంట్‌‌కు చెందినవే. లగ్జరీ డిజైనర్ తరుణ్ తహ్లియాని ప్రొడక్ట్‌‌ల కోసం ఏబీఎఫ్‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌ ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా  ఇండియన్ లగ్జరీ  లేబుల్‌‌  సవ్యసాచిలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. బర్బెర్రీ, క్లార్క్స్‌‌, కోచ్‌‌, కేట్‌‌ స్పేడ్‌‌ న్యూ యార్క్‌‌, మనీష్‌‌ మల్హోత్రా, మైకల్ కోర్స్‌‌ వంటి బ్రాండ్లతో రిలయన్స్  బ్రాండ్స్ లిమిటెడ్ అసోసియేట్ అయ్యింది.

 ఫ్యాషన్ మార్కెట్ సైజ్ రూ.475 లక్షల కోట్లకు! 

దేశ ఫ్యాషన్ మార్కెట్ 2024 నాటికి 5.7–5.8 ట్రిలియన్ డాలర్ల (రూ.475 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అంచనా. ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లకు గిరాకీ ఉండడం, ఈ–కామర్స్‌‌ విస్తరించడం,  ప్రైవేట్ లేబుల్స్‌‌పై ఫోకస్ పెరగడం, ఇంటర్నేషనల్ బ్రాండ్లు  ఎంట్రీ ఇవ్వడం  వంటి కారణాలతో ఈ ఇండస్ట్రీ దూసుకుపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్  కిందటేడాది ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది.

కేవలం పెంటప్ డిమాండ్ వలన లగ్జరీ ప్రొడక్ట్‌‌లకు గిరాకీ పెరగడం లేదని, కన్జూమర్లు ప్రీమియం ప్రొడక్ట్‌‌లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని పైక్‌‌ ప్రెస్టన్ పార్టనర్స్‌‌ (ఆసియా)  మేనేజింగ్ పార్టనర్‌‌‌‌ రాహుల్ ప్రసాద్ అన్నారు. ‘విదేశాల్లోని సెల్ఫ్‌‌రిడ్జెస్‌‌ లేదా గ్యాలరీల సైయెట్‌‌ స్టోర్‌‌‌‌కు వెళితే ఇండియన్ కన్జూమర్లు క్లియర్‌‌‌‌గా కనిపిస్తారు.  పారిస్‌‌లోని గ్యాలరీల సైయట్ స్టోర్‌‌‌‌లో టాప్ 5 మంది షాపర్స్‌‌లో ఇండియన్స్ ఉంటారు’ అని ఆయన పేర్కొన్నారు.

గతంలో లగ్జరీ బ్రాండ్లు తక్కువగా అందుబాటులో ఉండేవని, వీటిని కొనుగోలు చేయడానికి విదేశాలకు కన్జూమర్లు వెళ్లవలసి వచ్చేదని  నైకా ఫ్యాషన్ సీఈఓ అద్వైత నాయర్ గతంలో అన్నారు. ఇందులో మార్పు వస్తోందని,  లగ్జరీ బ్రాండ్లనే దేశంలోని కన్జూమర్ల ముందుకు తెస్తున్నామని చెప్పారు.