భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఆదివారం రాత్రి గోదావరికి నదీహారతి నిర్వహించారు. చైత్ర శుద్ధ తదియ సందర్భంగా ఆదివారం నిర్వహించిన నదీహారతి విశిష్టమైందని పురోహితులు రామవజ్జుల రవికుమార్ తెలిపారు. గణపతిపూజ, దీపోత్సవం అనంతరం గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య ముందుగా సీతారామచంద్రస్వామికి, ఆ తర్వాత గోదావరి నదికి హారతి ఇచ్చారు.
సీతారామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన
భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్వామికి బాలబోగం నివేదించాక వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశాక, అలంకరణ అనంతరం బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
