వెంకటేశ్వరస్వామి టెంపుల్​లో చోరీ

వెంకటేశ్వరస్వామి టెంపుల్​లో చోరీ
  • రామాంజపూర్ వెంకటేశ్వరస్వామి టెంపుల్​లో చోరీ
  • బంగారు, వెండి నగలతో పాటు 
  • హుండీ డబ్బులను ఎత్తుకెళ్లిన దొంగలు
  • ఏడాదిలో రెండోసారి దొంగతనం

శంషాబాద్,వెలుగు: వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. శంషాబాద్ మండల పరిధిలోని రామాంజపూర్ గ్రామంలో పురాతన వెంకటేశ్వర  ఆలయం ఉంది. సోమవారం రాత్రి దోపిడీ దొంగలు ఆలయంలోకి వచ్చి సీసీ కెమెరాలను పగులగొట్టారు. ఆ తర్వాత  స్వామివారి శఠగోపం, కిరీటాలు, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీని పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల రికార్డింగ్ స్టోరేజ్ అయ్యే డీవీఆర్ బాక్స్​ను కూడా తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం  ఈ విషయాన్ని గమనించిన ఆలయ పూజారి స్థానికులకు చెప్పగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో టెంపుల్ దగ్గరికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. రామాంజపూర్ లోని వెంకటేశ్వర ఆలయంలో గతేడాది సైతం చోరీ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఏడాదిలోపే మరోసారి దొంగతనం జరగడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ పరిరక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్​ను కోరారు.