- 2–0తో ఇంగ్లండ్ గెలుపు
- హైదరాబాద్‌లో హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ సక్సెస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గడ్డపై అద్భుత ఆటతో అదరగొట్టి వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్న ఇండియా విమెన్స్ హాకీ టీమ్.. ఆఖరాటలో నిరాశపరిచింది. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో అజేయంగా దూసుకెళ్లిన అమ్మాయిలు ఫైనల్లో తడబడ్డారు. గచ్చిబౌలి హాకీ గ్రౌండ్‌లో శనివారం జరిగిన తుదిపోరులో తొమ్మిదో ర్యాంకర్ ఇండియా 0–2తో ఆరో ర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌తో సరిపెట్టింది. 13వ నిమిషంలో గ్రేస్ బాల్ట్‌సన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ చెరో గోల్ చేసి ఇంగ్లిష్ టీమ్‌ను గెలిపించారు. థర్డ్ ప్లేస్‌కోసం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది.
ఇండియా ఫార్వర్డ్ నవనీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్‌ద టోర్నమెంట్‌గా నిలిచింది. ముగింపు వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, క్రీడా శాఖ సలహాదారు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ హాజరై అవార్డులు అందజేశారు. హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో ఇండియా విన్నర్‌గా నిలవలేకపోయినా.. వరల్డ్ కప్ బెర్తు అందుకొని తమ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆగస్టు 14–30 మధ్య బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరిగే వరల్డ్ కప్‌లో మెన్స్ టీమ్‌తో కలిసి పోటీపడనుంది.
పోటాపోటీలో ప్రత్యర్థిదే పైచేయి..
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే పోటాపోటీగా సాగింది. ఇరు జట్లూ బాల్‌ను చెరో 50 శాతం తమ కంట్రోల్‌లో ఉంచుకున్నాయి. ఇంగ్లండ్ ఎనిమిదిసార్లు టార్గెట్‌పై దాడులు చేసి ఫలితం రాబట్టగా.. ఏడుసార్లు లక్ష్యంపై షాట్లు కొట్టిన ఇండియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 60 నిమిషాల పాటు నిరంతరాయంగా పోరాడినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ప్లేయర్లు ఛేదించలేకపోయారు. నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించినా.. ఒక్కదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆట ప్రారంభమైన నిమిషం నుంచే ఇండియా దూకుడు చూపెట్టింది. స్ట్రయికర్లు ఇంగ్లండ్ డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచారు.
రెండో నిమిషంలోనే స్టార్ ప్లేయర్ నవనీత్ కౌర్ జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్‌ను సంపాదించి పెట్టింది. అయితే, నవనీత్ డ్రాగ్ ఫ్లిక్ షాట్‌ను ఇంగ్లండ్ గోల్ కీపర్ అద్భుతమైన డైవ్‌తో అడ్డుకోవడంతో ఆతిథ్య జట్టుకు తొలి గోల్ చేజారింది. తొలి పది నిమిషాల పాటు ఇండియా పటిష్టమైన డిఫెన్స్‌తో పాటు మెరుపు దాడులతో ఆకట్టుకుంది. కానీ, 13వ నిమిషంలో ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఆ జట్టు స్టార్ డ్రాగ్ ఫ్లిక్కర్ గ్రేస్ బాల్స్టన్ గోల్‌గా మలిచింది. రెండో క్వార్టర్‌లో ఇండియా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా మిడ్ ఫీల్డ్ నుంచి బాల్‌ను సర్కిల్‌లోకి పంపడంలో హోమ్‌టీమ్ ప్లేయర్లు సక్సెస్ అయ్యారు. అయితే, ఇంగ్లండ్ డిఫెండర్లు గోడలా అడ్డుపడటంతో మన స్ట్రయికర్లు గోల్ పోస్ట్ వైపు స్పష్టమైన షాట్లు కొట్టలేకపోయారు.
దాంతో బ్రేక్ టైమ్‌కు ఇంగ్లండ్ 1–0తో లీడ్‌లో నిలిచింది. మూడో క్వార్టర్‌లో ఇంగ్లండ్ ఆట తీరు మార్చుకుంది. బాల్‌ను తమ ఆధీనంలో ఉంచుకుంటూ నెమ్మదిగా పాస్‌లు ఇస్తూ ఇండియాకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. ఈ క్రమంలో 43వ నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ ఎలిజబెత్ నీల్ కొట్టిన బాల్ ఇండియా డిఫెండర్‌కు తగిలి దిశ మార్చుకుంది. గోల్ కీపర్ బిచ్చు దేవి దానిని అంచనా వేసేలోపే అది నెట్‌లోకి వెళ్లడంతో ఇంగ్లండ్ ఆధిక్యం డబులైంది. చివరి 15 నిమిషాల్లో ఇండియా పూర్తిగా ఎటాక్‌కు దిగింది. గోల్ కోసం మన ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు ఫ్యాన్స్‌ను అలరించాయి. మ్యాచ్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు ఇండియాకు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. స్టేడియం అంతా ఇండియా.. ఇండియా.. నినాదాలతో హోరెత్తింది. కానీ, ఆ అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చుకోవడంలో విఫలమవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.
150 ఇండియా కెప్టెన్ సలీమా టెటే ఈ పోరుతో ఇంటర్నేషనల్ కెరీర్‌లో 150 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరింది.
