అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి చిన్నారులకు పాలు

అంగన్వాడీలకు గుడ్ న్యూస్..  ఏప్రిల్ నుంచి  చిన్నారులకు పాలు
  • ములుగులో పైలట్​ ప్రాజెక్ట్​ సక్సెస్ తో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్లాన్ 
  • రాష్ట్రంలో 35,781 సెంటర్లు.. 4.50 లక్షల మంది చిన్నారులు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్​వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏప్రిల్ నుంచి వారికి పాలు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ కొత్త న్యూట్రిషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా అంగన్​వాడీ సెంటర్లలో ఉన్న 3 నుంచి 6 ఏండ్ల పిల్లలకు ప్రతీరోజు 100 ఎంఎల్ పాలను ఇవ్వనున్నారు. పేద, మధ్యతరగతి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 

ముందుగా ఈ పాల పంపిణీ కార్యక్రమాన్ని ఏజెన్సీ ఏరియా అయిన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. గత నవంబర్ నుంచి మొత్తం 640 అంగన్​వాడీల్లో 7,918 మంది చిన్నారులకు పాలు అందిస్తున్నారు. దీనివల్ల అక్కడి పిల్లల అటెండెన్స్ పెరగడమే కాకుండా.. బరువు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యంలో మంచి ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. దీంతో ఈ స్కీమ్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రోజుకు 45 వేల లీటర్లకు పైగా అవసరం

రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్​వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిల్లో ప్రీ స్కూల్ పిల్లలు దాదాపు 4.50 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. ఒక్కో చిన్నారికి 100 ఎంఎల్ చొప్పున లెక్కేస్తే.. రోజుకు 45 వేల లీటర్లకు పైగా పాలు అవసరమవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల్లో కాల్షియం, ప్రోటీన్ల కొరత లేకుండా చూడటం, రక్తహీనతను తగ్గించి వారు శారీరకంగా బలంగా ఎదిగేలా చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశమని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు.  

విజయ డెయిరీ లేదా నందిని డెయిరీ..

ప్రస్తుతం ములుగు జిల్లాలో పంపిణీ చేస్తున్న పాలను విజయ డెయిరీ నుంచి కొంటున్నారు. అయితే, సర్కార్ బడుల్లోని 19 లక్షల మంది పిల్లలకు కూడా వారంలో మూడు రోజులు పాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అటు బడి పిల్లలకు, ఇటు 4.50 లక్షల మంది అంగన్​వాడీ చిన్నారులకు ఒకేసారి పాలు సప్లై చేయాలంటే విజయ డెయిరీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. ఒకవేళ విజయ డెయిరీలో పాల కొరత వస్తే.. కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే విజయ, నందిని సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిగినట్లు సమాచారం.