బంగారం దిగుమతి ఎక్కువైంది

బంగారం దిగుమతి ఎక్కువైంది
  • ఈ ఏడాదిలో గోల్డ్ ఇంపోర్ట్స్​ 170 శాతం పెరిగాయ్​
  • పండగ సీజన్​ కొనుగోళ్ల వల్లే డిమాండ్​
  • ఆర్​బీఐ కూడా 41 టన్నుల బంగారం కొంది

వెలుగు బిజినెస్​ డెస్క్​: దేశంలో బంగారం కొనుగోళ్లు మళ్లీ జోరందుకున్నాయి. ఈ కొనుగోళ్లతో బంగారం దిగుమతులూ పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రేడ్​ డెఫిసిట్​ (వాణిజ్య లోటు అంటే ఎగుమతులు– దిగుమతుల మధ్య తేడా) పెరిగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్​–నవంబర్​ మధ్య కాలంలో ట్రేడ్​ డెఫిసిట్​ 122 బిలియన్​ డాలర్లకు చేరింది. బంగారం రేటు కొంత ఎక్కువే ఉన్నా దిగుమతులు పెరగడం గమనించాలి.ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి ఎనిమిది నెలల్లో బంగారం దిగుమతులు ఏకంగా 170 శాతం పెరిగాయి. దీంతోపాటే ఆ మేరకు ట్రేడ్​ డెఫిసిట్​ కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో బంగారం దిగుమతులను పోల్చడం ఒక విధంగా సరయినది కాదు. ఎందుకంటే కిందటేడాది మొదటి క్వార్టర్లో దేశంలో లాక్​డౌన్​ అమలయింది. సెకండ్​ క్వార్టర్లోనూ ఆంక్షలు కొనసాగాయి. ఫలితంగా కొనుగోళ్లు జరపడానికి ప్రజలకు పెద్దగా అవకాశం దొరకలేదు. అత్యవసరమైన వస్తువుల కొనుగోళ్లకే జనం పరిమితం కావల్సి వచ్చింది.
2019–20తో పోలిస్తే బంగారం దిగుమతులూ, ట్రేడ్​ డెఫిసిట్‌‌ భారీగా పెరిగాయి. ఈ కాలంలో బంగారం దిగుమతులు 61.4 శాతం పెరిగి 33.32 బిలియన్​ డాలర్లకు చేరగా, ట్రేడ్​ డెఫిసిట్​ 7.5 శాతం పెరిగింది. మొత్తం దిగుమతులలో బంగారం దిగుమతుల వాటా 2015–16  తర్వాత మొదటిసారిగా ఎక్కువైంది. ఏప్రిల్​–నవంబర్​ మధ్య కాలంలో బంగారం దిగుమతులు విలువపరంగా చూస్తే 8.6 శాతం పెరిగినట్లు కామర్స్​ మినిస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. గత కొన్ని  సంవత్సరాలలో ఈ దిగుమతులు 6.3–7.7 శాతం మధ్యలోనే ఉండేవి. కిందటేడాదికి ప్రత్యేక మినహాయింపు ఉంది. ఎకనమిక్​ యాక్టివిటీ అంత చురుగ్గా సాగలేదు. దాంతో బంగారం దిగుమతులూ 5.6 శాతం తగ్గి 12.3 బిలియన్​ డాలర్లకే పరిమితమయ్యాయి. డిమాండ్​ లేకపోవడం వల్లే దిగుమతులు తగ్గిపోయాయి.పరిమాణం ప్రకారం చూస్తే బంగారం దిగుమతులు 2013–14 నాటి లెవెల్​కు పెరిగాయి. ఏప్రిల్​–సెప్టెంబర్​ 2021 మధ్యలో మన దేశం 445 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇందులో చాలా కొద్దిగా మాత్రమే సెమి మాన్యుఫాక్చర్డ్​ రూపంలో దిగుమతయ్యింది. పై దిగుమతులలో మూడింట రెండొంతులు అంటే దాదాపు 292 టన్నులు ఒక్క సెకండ్​ క్వార్టర్లోనే దిగుమతవడం విశేషం. ఈ ఏడాది పండగల సీజన్​కు ముందే ఈ దిగుమతులు జరిగాయి. ఒక్క ఆగస్టు నెలలోనే చూస్తే 120 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయింది. 2020–21లో మొదటి ఆరు నెలల్లో దిగుమతి చేసుకున్న బంగారానికి ఇది సమానం. మరో 96 టన్నుల బంగారం సెప్టెంబర్​లో దేశంలోకి వచ్చింది. అక్టోబర్​, నవంబర్​ 2021లోనూ ఇంకో 150–175 టన్నుల బంగారం దిగుమతులు జరిగి ఉంటాయని అంచనా. 2013–14లో మన దేశం 453 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అందులో 41 టన్నులు సెమి మాన్యుఫాక్చర్డ్​. డిమాండ్​ తగ్గించడానికి టారిఫ్​లను అప్పట్లో ప్రభుత్వం పెంచినా, దిగుమతులు పెరగడం విశేషం.

రేటు పెరుగుతున్నా జోరు తగ్గలే....
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ దిగుమతుల జోరు పెరుగుతుండటం గమనించదగ్గది. కరోనా వైరస్​ ప్రపంచాన్ని చుట్టేయడంతో గోల్డ్​ రేట్లు పెరగడం మొదలెట్టాయి. జనం స్టాక్​ మార్కెట్లకు దూరంగా జరిగారు. ఆ తర్వాత కొన్ని నెలల్లో స్టాక్​ మార్కెట్లు పుంజుకున్నా, గ్లోబల్​గా బంగారం రేట్లు మాత్రం కొన్ని నెలలపాటు పై స్థాయిలోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్​ఫ్లేషన్​ పెరగడమే దీనికి కారణమని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఆగస్టు 2020లో ఔన్సు 2057 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గి ఇటీవలి నెలల్లో ఔన్సు బంగారం 1750–1850 డాలర్ల మధ్యలో కదులుతోంది.

జ్యుయెలరీ డిమాండ్​ 60 శాతం పెరిగింది..
వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ కూడా తన తాజా రిపోర్టులో ఇండియాలో జ్యుయెలరీ డిమాండ్​ జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో 60 % పెరిగినట్లు తెలిపింది. ఆ క్వార్టర్లో జ్యుయెలరీ డిమాండ్​ 96 టన్నులు.  పెంటప్​ డిమాండ్​, ఎకానమిక్​ యాక్టివిటీ ఊపందుకోవడం, బంగారం రేటు తక్కువగా ఉండటం వల్లే జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో డిమాండ్​ పెరిగిందని వరల్​ గోల్డ్​ కౌన్సిల్​ వివరించింది. సెకండ్​ క్వార్టర్లో గోల్డ్​ కాయిన్స్​, బార్ల డిమాండ్​ కూడా 27 శాతం పెరిగి 43 టన్నులయిందని పేర్కొంది. ఈసారి గమ్మత్తేమంటే దేశంలోని ప్రజలతోపాటు, రిజర్వ్​ బ్యాంకుకూ బంగారమంటే ఆసక్తి పెరగడం. ఈ ఫైనాన్షియల్​ ఇయర్ సెకండ్​ క్వార్టర్లో ఆర్​బీఐ 41 టన్నుల బంగారం కొన్నట్లు వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ అంచనా వేస్తోంది. దీంతో ఆర్​బీఐ వద్ద ఉన్న బంగారం మొత్తం 745 టన్నులకు చేరింది. ఆర్​బీఐ వద్ద గోల్డ్ నిల్వలు 2021లో మునుపెన్నడూ లేనంతగా ఎక్కువవుతాయని అంచనా వేస్తోంది వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​. 2009లో ఐఎంఎఫ్​ నుంచి 200 టన్నుల బంగారం కొన్నప్పుడు ఆర్​బీఐ వద్ద ఎక్కువ నిల్వలు నమోదయ్యాయి.