గోల్డ్ షాపులో చోరీ పక్కా స్కెచ్..

గోల్డ్ షాపులో చోరీ పక్కా స్కెచ్..
  •     నంబర్ లేని బైక్స్ పై వచ్చి.. కస్టమర్లుగా షాపుల్లో రెక్కీ 
  •     సికింద్రాబాద్ నుంచి నాగోల్ దాకా వెంబడించి చోరీ 
  •     17 టీంలతో పోలీసుల సెర్చింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: గోల్డ్ షాపులో కాల్పులు జరిపి నగలు దోచుకున్న ఘటనలో దొంగల ఆచూకీ ఇంకా దొరకలేదు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 17 స్పెషల్ టీంలతో గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా గాలిస్తున్నారు. దొంగలు పక్కాగా స్కెచ్ వేసి, ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నెంబర్ లేని బైకులపై వచ్చి.. కస్టమర్లుగా షాపుల్లో తిరిగి రెక్కీ వేసినట్లు దర్యాప్తులో తేలింది. నాగోల్ స్నేహపురి కాలనిలోని మహదేవ్ జువెల్లర్స్ లో గురువారం రాత్రి కాల్పులు జరిపిన దొంగలు 2 కిలోల బంగారు నగలు, రూ. 1.70 లక్షల క్యాష్ తో పారిపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షాపు ఓనర్ కల్యాణ్ చౌదరి, బంగారు నగల సప్లయర్ సుఖ్ దేవ్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం కలిసి మాట్లాడారు. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, బాధితుల స్టేట్​మెంట్లను రికార్డ్ చేశారు. షాప్​లోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ల సమీపంలోని లాడ్జీలు, రెస్టారెంట్లలో సోదాలు చేశారు.  

నాలుగేండ్ల క్రితం కీసరలోనూ..

    
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోనూ 2018 సెప్టెంబర్‌‌‌‌లో ఇదే తరహాలో దోపిడీ యత్నం జరిగింది. నాగారంలోని ఆర్‌‌‌‌ఎస్‌‌ రాథోడ్‌‌ జువెల్లర్స్‌‌ వద్దకు మూడు బైక్ లపై ఆరుగురు దొంగలు వచ్చారు. ఇద్దరు తుపాకులతో షాపులోకి వెళ్లగా, మిగతా నలుగురు షాప్ బయట రెండు వైపులా నిల్చున్నారు. లోపలికి వెళ్లిన దుండగులు రూ. 15 వేల గోల్డ్ చైన్ కావాలంటూ ఓనర్ వద్దకు వెళ్లి తుపాకులు తీశారు. ఇంతలో షాపు సిబ్బంది అలర్ట్ కావడంతో ఇద్దరు దుండగులు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దోపిడీ జరగడంతో అంతర్రాష్ట్ర ముఠా పనే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు.  

సికింద్రాబాద్ నుంచే వెంబడించిన్రు

నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి ఉపయోగించిన నెంబర్ ప్లేట్లు లేని బైకులను చోరీ చేసి తెచ్చినట్లుగా గుర్తించారు. సుఖ్‌‌దేవ్‌‌ అతని ఓనర్ రాజ్‌‌కుమార్‌‌‌‌తో కలిసి గురువారం సాయంత్రం సికింద్రాబాద్ మోండా మార్కెట్‌‌ నుంచి బయలు దేరగా, నలుగురు దొంగలు వీరి బైక్ ను వెంబడిస్తూ వచ్చారు. బాధితులు నాచారం, బోడుప్పల్‌‌, పనామా, వనస్థలిపురంలోని జువెల్లరీ షాప్స్‌‌లో ఆభరణాలు డెలివరీ చేశారు.  రూ.1.70 లక్షలు కలెక్షన్ చేసుకున్నారు. రాత్రి 9.15కు నాగోల్‌‌లోని మహదేవ్ జువెల్లర్స్‌‌ కు వెళ్లగా దొంగలు ఫాలో అవుతూనే వచ్చారు. షాపులో కస్టమర్స్ ఎవరూ లేనిది చూసి కాల్పులు జరిపి నగలు, డబ్బు దోచుకుపోయారు.