హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించలేని రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి యూరియా బుక్ చేసుకోవచ్చు. మీసేవ ఆపరేటర్ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసి రైతు ఎంచుకున్న ఎరువుల డీలర్ వద్ద బుకింగ్ పూర్తి చేస్తారు. రైతు మొబైల్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసిన తర్వాత బుకింగ్ పూర్తవుతుంది.
అనంతరం బుకింగ్ ఐడీ ఇస్తారు. ఈ సేవకు రూ.10 మాత్రమే రుసుము ఉంటుంది. వ్యవసాయ శాఖ తెలిపిన ప్రకారం.. బుకింగ్ చేసిన రోజు మినహా మరో 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడీ చెల్లుబాటు అవుతుంది. ఆలోపు సంబంధిత డీలర్ వద్ద నుంచి యూరియా తీసుకోవాలి. రైతులు అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు
