- కేటీఆర్‌పై ఆధిపత్యం కోసమే కాళేశ్వరంపై హరీశ్ విమర్శలు
- మంత్రులతో ముఖాముఖిలో 200కు పైగా వినతి పత్రాలు
- కలెక్టర్లతో మాట్లాడి కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించిన మంత్రి
హైదరాబాద్/ట్యాంక్ బండ్, వెలుగు: బీఆర్ఎస్‌లో కేటీఆర్ కన్నా తాను ఎక్కడ వెనుకబడిపోతానేమోననే భయంతో హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సొంత పార్టీలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని, అందులో భాగంగానే మూడ్రోజుల కింద కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌజ్‌కు పోయి విమర్శలు చేస్తే... ఇప్పుడు కాళేశ్వరంపై హరీశ్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్, హరీశ్ నాటకాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 200కు పైగా వినతి పత్రాలను మంత్రి స్వీకరించారు. అందులో ఎక్కువగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, చేయూత పింఛన్లపైనే ఉన్నాయి. ఇంకొందరు భూ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఆయా సమస్యలపై మంత్రి కలెక్టర్లతో, సిటీ జోనల్ కమిషనర్లతో మాట్లాడి అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించారు.
మిగిలిన వాటిని పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. అందువల్లే రేషన్ కార్డు కావాలంటూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, తమది ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మంత్రులతో ముఖాముఖి చాలా మంచి కార్యక్రమమని, దీనిని నిర్వహిస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా మంత్రులను కలిసి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఏర్పడిందని, దీని వల్ల ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉందనే అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై రోజువారీ మానిటరింగ్ ఉంటుందని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యమని వివేక్ వివరించారు.
మంత్రి వివేక్‌ను కలిసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు..
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సారధ్య సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసి, మీ ద్వారానైనా తమకు న్యాయం జరిగేటట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వద్ద పలువురు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందలేదన్నారు. ఈ విషయంపై మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.
