తెలంగాణలో 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. నవంబర్లో నిర్వహించే చాన్స్

తెలంగాణలో 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. నవంబర్లో నిర్వహించే చాన్స్
  • ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నవంబర్లో నిర్వహించే చాన్స్

న్యూఢిల్లీ: 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌‌‌‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలను నవంబర్‌‌‌‌లో నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గత 2025 ఎడిషన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు బిహార్ ఆతిథ్యం ఇచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలనే లక్ష్యానికి తగ్గట్టుగానే తెలంగాణకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు మాండవీయ చెప్పారు. ఈ గేమ్స్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉత్సాహం తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో సుమారు 8 వేల మంది అథ్లెట్లు, అధికారులు, సపోర్ట్ సిబ్బంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. బిహార్‌‌‌‌లో జరిగిన గత ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌‌‌‌లో 28 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు.

ఆ ఎడిషన్‌‌లో మొత్తం 26 రికార్డులు నమోదుకాగా, వాటిలో 13 జాతీయ యువజన రికార్డులు వెయిట్‌‌లిఫ్టింగ్‌‌లో నమోదయ్యాయి. కాగా, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌‌ నిర్వహించేందుకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి 2024లోనే విజ్ఞప్తి చేశారు.

కానీ, అప్పటికే 2025వ ఎడిషన్ గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిహార్‌‌‌‌ను ఎంపిక చేసినందున, 2026వ ఎడిషన్ గేమ్స్‌‌ నిర్వహించేందుకు తెలంగాణకు చాన్స్ ఇస్తామని కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.