టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్.. 7 నెలల్లో 77వేల టికెట్లు

టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్.. 7 నెలల్లో  77వేల టికెట్లు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తెచ్చిన బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. 7 నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గతేడాది జులైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్‌లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది టికెట్లను బుక్‌ చేసుకున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి టీఎస్‌ఆర్టీసీ 'బాలాజీ దర్శన్‌'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే.. శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసిన శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. భక్తులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని అధికారులు వెల్లడించారు.