ఏఐ మార్కెట్ రంగంలోకి గూగుల్

ఏఐ మార్కెట్ రంగంలోకి గూగుల్

వెలుగు బిజినెస్​ డెస్క్​: మైక్రోసాఫ్ట్ సపోర్టుతో దూసుకెళ్తున్న చాట్​జీపీటీకి పోటీగా తాము బార్డ్​ను తేనున్నట్లు గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ ప్రకటించడంతో ఈ రంగంలో పోటీ వేడెక్కనుంది. చైనా కంపెనీ బైదూ కూడా తమ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (ఏఐ) ​టూల్​ ఎర్నీని  తేనున్నట్లు వెల్లడించింది. రాబోయే కొన్ని వారాలలోనే తమ ఏఐ టూల్​బార్డ్​ అందుబాటులోకి వస్తుందని సుందర్​ పిచాయ్​ ఒక బ్లాగ్​పోస్టులో తెలిపారు. మనిషిలాగే మాటలు సాగించగలగడంతోపాటు, అడిగిన ప్రశ్నలకు బదులివ్వడమూ, వ్యాసాలు రాయడమూ, అంతెందుకు సాఫ్ట్​వేర్​ కోడ్​ కూడా రాసేయడం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ టూల్స్​తో సాధ్యపడుతుంది. కిందటేడాది నవంబర్​లో  ఓపెన్​ ఏఐ ఇంక్ తెచ్చిన చాట్​జీపీటీ (ఏఐ టూల్​) మార్కెట్లో సంచలనాన్నే సృష్టిస్తోంది. సోషల్​ మీడియా యాప్స్​ టిక్​టాప్​, ఇన్​స్టా కంటే వేగంగా ఎక్కువ మంది యూజర్లను సంపాదించడంలో చాట్​ జీపీటీ సక్సెసయింది. 10 కోట్ల మంది యూజర్లను తెచ్చుకోవడానికి టిక్​టాక్​ కు 9 నెలలు, ఇన్​స్టాగ్రామ్​కి రెండేళ్లు పైన పడితే, రెండు నెలల్లోనే 10 కోట్ల మంది యూజర్లను చాట్​ జీపీటీ  ఆకట్టుకోగలిగిందంటే ఏ రేంజ్​లో దూసుకెళ్తోందో మనం తెలుసుకోవచ్చు. సెన్సర్​టవర్ ఈ డేటా వెల్లడించినట్లు రాయిటర్స్​ పేర్కొంది. చాట్ జీపీటీ సక్సెస్​తో పోటీదారులు కళ్లు తెరిచారు. చాట్​జీపీటీ  పేరెంట్​ కంపెనీ ఓపెన్​ఏఐ లో మైక్రోసాఫ్ట్​ పెట్టుబడి ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓపెన్​ఏఐలో మైక్రోసాఫ్ట్​ 10 బిలియన్​ డాలర్ల దాకా పెట్టుబడి పెట్టడంతో ఇతర టెక్​ కంపెనీలు గూగుల్​, బైదు వంటివి తమ సొంత ఏఐ చాట్​బాట్స్​ను తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

గూగుల్​ బార్డ్​..

కొంత మంది నమ్మకమైన టెస్టర్లకు బార్డ్​ పేరుతో తమ ఏఐ చాట్​బాట్​ను అందుబాటులోకి తెచ్చినట్లు సుందర్​ పిచాయ్​ ప్రకటించారు. ఆ తర్వాత వారాలలో దానిని ప్రజలకూ అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల కిందటే మేం లాంగ్వేజ్​ మోడల్​ ఫర్​ డైలాగ్​ అప్లికేషన్స్​ (లామ్​డా) పేరుతో నెక్స్ట్​ జనరేషన్​ లాంగ్వేజ్​ టూల్​ తెచ్చాము. ఇప్పుడు లామ్​డా పవర్​తో పనిచేసే ఏఐ సర్వీస్​ బార్డ్​ను తెస్తున్నామని సుందర్​ పిచాయ్​ తన బ్లాగ్​పోస్టులో వివరించారు. పార్టీ ప్లానింగ్​ కోసం టిప్స్​ ఇవ్వడం మొదలు, లంచ్​ ఐడియాలు, రిఫ్రిజిరేటర్​లో ఏ ఫుడ్​ మిగిలిపోయిందనే వివరాల దాకా అన్నింటినీ బార్డ్​ అందించడగలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

బైదూ ఎర్నీ..

ఎన్​హాన్స్​డ్​ రిప్రజెంటేషన్​ థ్రూ నాలెడ్జ్​ ఇంటిగ్రేషన్​ (ఎర్నీ) పేరుతో బైదూ కూడా పోటీకి దిగుతోంది. చైనాకు చెందిన బైదు సెర్చ్​ ఇంజిన్​ ఆ దేశంలో చాలా పాపులర్​ అనే విషయం తెలిసిందే. 2019 నుంచే ఎర్నీకి మెరుగులు దిద్దుతున్నట్లు బైదు వెల్లడించింది.

ఓపెన్​ ఏఐ చాట్​బాట్​..ఏది అడిగినా రాసిస్తది 

జనరేటివ్​ ప్రిట్రెయిన్డ్​ ట్రాన్స్​ఫార్మర్​ (జీపీటీ) సిరీస్​ మోడల్స్​లో మొదటిదానిని 2019 లోనే ఓపెన్​ ఏఐ తెచ్చింది. చాలా టాపిక్స్​పై ప్రశ్నలకు టెక్స్ట్​ రూపంలో బదులిచ్చే సామర్ధ్యం దాని సొంతం. ఒక రకమైన న్యూరల్​ నెట్​వర్క్​ (ట్రాన్స్​ఫార్మర్​ ఆర్కిటెక్చర్​) ను ఇది ఆధారంగా చేసుకుంది. నేచురల్​ లాంగ్వేజ్​ ప్రాసెసింగ్​ టాస్క్​లను  ఈ నెట్​వర్క్ చాలా ఎఫెక్టివ్​గా హ్యాండిల్​ చేస్తుంది. అకడమిక్​ అవసరాలకు కూడా చాట్​జీపీటీ ని వాడుతున్నట్లు సమాచారం. అమెరికాలోని స్టూడెంట్లు తమ వ్యాసాలు (ఎస్సేస్​) రాయమని చాట్​ జీపీటీని అడుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.