హరీష్ రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెషల్ మీటింగ్.. పార్టీ మార్పుపై క్లారిటీ

హరీష్ రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెషల్ మీటింగ్.. పార్టీ మార్పుపై క్లారిటీ

తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారబోతున్నారంటూ వార్తలు రావడంతో స్పందించారాయన. తాను తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో భేటీ అయ్యానని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే మంత్రికి కలిశానని చెబుతున్నారు. 

మంత్రి హరీష్ రావును కలిసిన తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగిందని, దీంట్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణం గురించి హరీష్ రావుతో చర్చించానని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా.. ఎత్తివేయకపోయినా తాను బీజేపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.