గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ

గోల్డెన్ టెంపుల్‌లో గోవర్ధన పూజ

హైదరాబాద్ సిటీ, వెలుగు :  శ్రీకృష్ణుడిని పూజించిన వారు, మరే ఇతర దేవుళ్లను పూజించాల్సిన అవసరం లేదని, గోవర్ధన గిరిని ఆరాధించేవారికి ఆరోగ్యం, సంపద, శాంతి  చేకూరుతుందని హరే కృష్ణ మూవ్​మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌరీచంద్ర దాస ప్రభూజీ అన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి.  హరే కృష్ణ మూవ్​మెంట్​ప్రెసిడెంట్ సత్య గౌరీచంద్ర దాస ప్రభూజీ మాట్లాడుతూ..  శ్రీకృష్ణుడు తన భక్తులతో గడిపిన కాలాన్ని లీలలుగా పిలుస్తారన్నారు.

కార్యక్రమంలో ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన చిన్న కొండను పోలిన 350 కిలోల అన్న కూటమి ప్రధానాకర్షణగా నిలిచింది.  కార్తీకదీపం వెలిగించి కార్తీక దీపోత్సవం ప్రారంభించారు. భగవంతునికి నెయ్యి దీపాలు సమర్పించి, అన్నకూటములకు చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  శ్రీకృష్ణుడు గోవర్ధన కొండను ఎత్తే యానిమేషన్ వీడియో భక్తులను పరవశింపజేసింది.