నల్గొండ, వెలుగు: మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన 2కే, 5కే, 10కే తెలంగాణ రన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
త్వరలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మగ్గారి శ్రీనివాసరావు, బండారు ప్రకాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్, అనితారాణి, డీఎస్పీ శివరామిరెడ్డి పాల్గొన్నారు.
