రూ. 5వేల కోట్లు ఇస్తామని.. నయా పైసా ఇస్తలె!

రూ. 5వేల కోట్లు ఇస్తామని.. నయా పైసా ఇస్తలె!
  •     ఐదేండ్లుగా కేటాయింపులు ఇవ్వని ప్రభుత్వం  
  •     ప్రత్యేక ఫండ్స్​ ఇయ్యాలంటున్న కార్పొరేటర్లు 
  •     లేదంటే ఆందోళన చేస్తమని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గ్రేటర్ కు ప్రతిఏటా10 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఐదేండ్లుగా నయాపైసా ఇవ్వడం లేదు. దీంతో బల్దియా అధికారులు అప్పలు చేయక తప్పని పరిస్థితి ఉంది.  వడ్డీలు కట్టేందుకు ఎంప్లాయీస్​జీతాలు ఆపాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల ఎస్​టీపీల నిర్మాణం, ఓఆర్ఆర్ పరిధిలోని నల్లాల కనెక్షన్లకు వాటర్​బోర్డుకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఇచ్చింది. ఇందులో చాలా వరకు పనులు గ్రేటర్ లో కాకుండా ఔటర్​ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం సిటీకి  ఇస్తున్నట్లు చెప్పుకుంది.  తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బడ్జెట్​లో బల్దియాకు కేటాయింపులతోనే సరిపెడుతుంది. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. కనీసం ప్రభుత్వ భవనాల పన్నులు కూడా బల్దియాకు చెల్లించడంలేదు.  వాటర్​బోర్డుకు నిధులు ఇచ్చినట్టుగానే అప్పుల్లో ఉన్న బల్దియాకు కూడా ఇవ్వాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రత్యేక ఫండ్స్​ కేటాయించాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

బల్దియా చేసిన అప్పులు 

స్ట్రాటజిక్​ రోడ్ ​డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్​డీపీ) కోసం ఎస్​బీఐలో 8.65 శాతం వడ్డీతో రూ.2500 కోట్లు , కాంపెన్సివ్ రోడ్​ మెయింటెనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1460 కోట్లు తెచ్చింది. మళ్లీ ఎస్​ఆర్​డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా రూ.495 కోట్లు తీసుకొచ్చింది. ఇందులో రూ.200 కోట్లు 8.90 శాతం, 190 కోట్లు 9.38శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. రూ.140 కోట్లను హడ్కో ద్వారా  వాంబే హౌసింగ్​ స్కీమ్ కోసం తెచ్చింది. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అన్ని కలిపితే రూ.4,595 కోట్ల అప్పు చేసింది. దీనికి వడ్డీ ఏడాదికి రూ.371.83 కోట్లు చెల్లిస్తుంది.  రోజుకు ఒక కోటి ఒక లక్ష 87వేల123  వడ్డీ కడుతోంది.

ఐదేళ్లలో ఫండ్స్​ నిల్

2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి బల్దియాకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం రూ.312.46 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బడ్జెట్​లో రూ.966.72  కేటాయించినా,  సగం ఫండ్స్​ కూడా ఇయ్యలేకపోయింది. ప్రభుత్వం భవనాల ఆస్తిపన్ను సైతం చెల్లించడంలేదు. ఇప్పటికే రూ.600 కోట్లు బకాయి ఉంది.

బడ్జెట్​లో పెట్టి.. ఇయ్యకుంటే ఎట్ల 

ఎస్​టీపీలను నిర్మించడానికి ముందు సిటీలో డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలి. ఆ తర్వాత వాటిని నిర్మిస్తే బాగుంటుంది. ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఇయ్యకుంటే ఎట్ల. ఇప్పటికే బల్దియా తెచ్చిన అప్పులకు రోజుకు కోటికిపైగా మిత్తి కడుతుంది. కార్పొరేటర్లకు కూడా ఫండ్స్​ లేవు. 
- తోకల శ్రీనివాస్ రెడ్డి, మైలార్​దేవ్​పల్లి కార్పొరేటర్

వెంటనే నిధులు ఇవ్వాలె

ప్రభుత్వం బల్దియాకు వెంటనే రూ.5 వేల కోట్ల నిధులు ఇవ్వాలి. ఒకప్పుడు మిగులు నిధులతో ఉన్న బల్దియా రాష్ర్టమొచ్చాక అప్పుల్లోకి పోయింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతుంగా పనులు చేసేందుకు ముందుకొస్తలేరు. గత కార్పొరేటర్లకు ఫండ్స్​ ఇచ్చినట్లుగానే ఇప్పుడు కూడా కోటి చొప్పున నిధులు కేటాయించాలి. ప్రభుత్వం బల్దియాను పట్టించుకోకపోతే ఆందోళన చేస్తం.
- దేవర కరుణాకర్, గుడి మల్కాపూర్ కార్పొరేటర్

బల్దియా కేటాయింపు ఇలా 

ఏడాది    కేటాయింపులు( రూ. కోట్లలో)    ఇచ్చింది (రూ. కోట్లలో)
2017-18    67.28    నిల్​
2018-19    నిల్​    నిల్​
2019-20    నిల్​    నిల్​
2020-21    25.21    నిల్​
2021-22    నిల్    నిల్