- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం యాక్సిడెంటల్ డెత్,
- శాశ్వత వైకల్యానికి బీమా రక్షణ
- విమాన ప్రమాద బీమా రూ. 3 కోట్ల వరకు
- రెగ్యులర్ ఎంప్లాయీస్‌తోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకూ వర్తింపు
- పాక్షిక వైకల్యంలోనూ ఆర్థిక సాయం అందేలా నిబంధనలు
- నేడు రవీంద్రభారతిలో బ్యాంకులతో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బీమా రక్షణను కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లందరికీ వర్తింపజేయనుంది. ఈ ఇన్సూరెన్స్‌ను గురువారం అమలులోకి తెచ్చేందుకు వీలుగా రవీంద్రభారతిలో బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపితే దాదాపు 9 లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక తోడ్పాటు లభించేది కాదు. ఆ లోటును భర్తీ చేస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబాలకు గరిష్ట భరోసా కల్పించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదనలను ఖరారు చేసింది.
దీంతో వివిధ ప్రభుత్వ విభాగాలలో సేవలందిస్తున్న లక్షలాది మంది సిబ్బందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ విధానంలో ఉద్యోగుల శాలరీ అకౌంట్ల ఆధారంగా రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కవరేజీని కల్పించారు. దీంతోపాటు విమాన ప్రమాదాల బారిన పడి మరణిస్తే సదరు బ్యాంకుల నిబంధనల ప్రకారం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా మొత్తం లభించనుంది.
విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా సాధారణ సమయాల్లో ప్రమాదం జరిగినా ఈ నిబంధనల ప్రకారం క్లెయిమ్ పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా తాత్కాలిక ఉద్యోగులకు ఇతర సామాజిక భద్రతా పథకాలు తక్కువగా అందుబాటులో ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం పరిధిని విస్తరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా బ్యాంకులు నిర్దేశించిన ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. అదేవిధంగా, పదవీ విరమణ పొందిన అనంతరం పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు (పెన్షనర్లు) కూడా వారి వయోపరిమితి నిబంధనల మేరకు బీమా రక్షణ వర్తింపజేశారు.
వివిధ బ్యాంకుల ప్రతిపాదనలు ఇలా..
ఈ బీమా పథకంలో భాగంగా వివిధ బ్యాంకులు ఉద్యోగుల కేటగిరీలు, వేతనాల ఆధారంగా యాక్సిడెంటల్ డెత్, వైకల్యానికి భారీ పరిహారాలను ప్రతిపాదించాయి. రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాన్ని బట్టి రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ప్రమాద మరణ బీమా.. అంతే మొత్తాన్ని శాశ్వత వైకల్యానికి, అలాగే రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పాక్షిక వైకల్యానికి అందిస్తుండగా, ఇతర కేటగిరీల తాత్కాలిక సిబ్బందికి రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు మరణ, వైకల్య కవరేజీలను ఎస్‌బీఐ ఖరారు చేసింది. ఉద్యోగులందరికీ రూ.1.2 కోట్ల నుంచి గరిష్టంగా రూ.1.5 కోట్ల వరకు ప్రమాద మరణం, శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యం కలిగితే ఆర్థిక భరోసాను యూనియన్ బ్యాంక్ కల్పిస్తోంది.
సాధారణ ఉద్యోగులకు వారి జీతాన్ని బట్టి రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు మరణ, సంపూర్ణ వైకల్య బీమా ఇస్తూ, పోలీసు అధికారులకు ప్రత్యేకంగా అన్ని శ్రేణుల్లోనూ రూ.1.5 కోట్ల వరకు ప్రమాద మరణ, సంపూర్ణ వైకల్య రక్షణను, రూ.75 లక్షల పాక్షిక వైకల్య బీమాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెగ్యులర్ సిబ్బందికి రూ.1 కోటి ప్రమాద మరణం, వైకల్య రక్షణతో పాటు విధి నిర్వహణలో మరణిస్తే అదనంగా రూ.25 లక్షలు చెల్లిస్తామని.. ఇతర తాత్కాలిక సిబ్బందికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కవరేజీని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్తోంది.
అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్.. రూ.45 లక్షల వరకు, యాక్సిస్ బ్యాంక్ రూ.1 కోటి నుంచి రూ.1.30 కోట్ల వరకు, ఫెడరల్ బ్యాంక్ రూ.75 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద మరణ బీమాను అందిస్తున్నాయి. పెన్షనర్ల విషయానికి వస్తే, ఇండియన్ బ్యాంక్ వయస్సు, నెలవారీ పెన్షన్ ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 75 ఏళ్ల వయస్సు పరిమితితో రూ.60 లక్షల నుంచి రూ. కోటి వరకు గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా కల్పిస్తున్నాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ హర్షం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థల్లో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వీరికి కూడా రూ.60 లక్షల వరకు బీమా రక్షణ కల్పించడం ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప భరోసానిస్తుందని జేఏసీ కమిటీ పేర్కొంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలకు దూరంగా ఉండే పరిస్థితి గతంలో ఉండేదని, ప్రభుత్వం వారిని కూడా ఈ బీమా పథకం పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ రాష్ట్ర చైర్మన్ పులి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దోయిపడి శ్రీధర్, దుర్గం శ్రీను పేర్కొన్నారు.
బీమాతో ఆర్థిక భరోసా: ఉద్యోగుల జేఏసీ, టీజీవో
ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావటం అభినందనీయమని ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్ తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుందని బుధవారం వారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, పాల్గొనే బ్యాంకుల మధ్య గురువారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాల కార్యక్రమం పట్ల యావత్ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు కోరారు.
