టీకా టెన్షన్.. రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్

టీకా టెన్షన్.. రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్
  • ప్రైవేట్‌‌ ఆస్పత్రులకూ సరఫరా బంద్
  • వ్యాక్సిన్ షార్టేజ్‌‌తో సర్కార్ నిర్ణయం
  • తర్వాత ఎప్పుడు మొదలైతదో స్పష్టత ఇవ్వని ఆఫీసర్లు
  • ఎంతకూ బుక్​ అవని స్లాట్స్​
  • 3 వారాల తర్వాతే 18 ఏళ్లు పైబడిన వాళ్లకు..సెకండ్ డోసు కోసం 
  • లక్షలాది మంది వెయిటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ బంద్ అయింది. టీకా పంపిణీని రెండు రోజులపాటు సర్కారు నిలిపేసింది. ప్రభుత్వ సెంటర్లలో శనివారం, ఆదివారం వ్యాక్సినేషన్‌‌ ఆపేస్తున్నట్లు ప్రకటించిన హెల్త్ డిపార్ట్‌‌మెంట్..  సోమవారం మళ్లీ ప్రారంభిస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు వ్యాక్సిన్ల సరఫరాను ఆరోగ్య శాఖ శనివారం నుంచి బంద్ చేసింది. వ్యాక్సిన్ లేక ఇలా చేస్తున్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ డోసులు వచ్చాక కూడా కేవలం సెకండ్ డోసు మాత్రమే వేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో వ్యాక్సిన్ వేయించుకుందామని ఎదురు చూస్తున్న లక్షలాది మందికి నిరాశ తప్పేలా లేదు. షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి 18–45 ఏండ్ల మధ్య వయస్సు వారికి వ్యాక్సినేషన్‌‌ స్టార్ట్ కావాలి. కానీ రాష్ర్టంలో ఇంకో మూడు, నాలుగు వారాల దాకా ఈ ఏజ్ గ్రూప్ వాళ్లకు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.

తయారీ కంపెనీల నుంచే కొనుక్కోండి

ప్రైవేట్ హాస్పిటళ్లకు వ్యాక్సిన్ ఇవ్వబోమని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఉన్న స్టాక్ అంతా కంప్లీట్‌‌గా వినియోగించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. డోసులు ఏవైనా మిగిలి ఉంటే తిరిగి ఇచ్చేయాలని సూచించింది. ఇకపై హాస్పిటళ్ల యాజమాన్యాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల దగ్గర నుంచే వ్యాక్సిన్ కొనుక్కోవాలని సూచించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో ఫస్ట్ డోసు తీసుకుని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది జనాల సంగతి ఏంటి అన్నదానిపై హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ క్లారిటీ ఇవ్వలేదు. రాష్ర్టంలో చిన్న హాస్పిటళ్లు కూడా ప్రభుత్వం ఇస్తున్న డోసులతో ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కంపెనీల దగ్గర నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసుకునే దారులు ఏవీ ఆయా హాస్పిటళ్లకు కనిపించడం లేదు. వ్యాక్సిన్ ధర, ఇతర అంశాలపై క్లారిటీ రాకుండా కొనే ప్రసక్తే లేదని హాస్పిటళ్లు చెబుతున్నాయి. దీంతో ఫస్ట్‌‌ డోసు ప్రైవేట్ హాస్పిటళ్లలో తీసుకున్న ఏడున్నర లక్షల మంది పరిస్థితి గందరగోళంలో పడింది.

డోసులు ఉన్నా బంద్ పెట్టిన్రు

ప్రభుత్వ సెంటర్లలో శనివారం, ఆదివారం వ్యాక్సినేషన్‌‌ లేదని హెల్త్ డైరెక్టర్‌‌‌‌ ప్రకటించారు. అయితే రాష్ర్ట సర్కార్ వద్ద ఇంకో 2 లక్షల 20 వేల డోసులు ఉన్నాయి. ఇవి రాబోయే రెండు రోజులకు సరిపోతాయి. అయినా డోసులు లేవని సాకుగా చూపి వ్యాక్సినేషన్ ఆపేయడం గమనార్హం. ఆ తర్వాత నుంచి కూడా సెకండ్ డోసు వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో 47,76,445 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 6,27,952 మంది మాత్రమే సెకండ్ డోసు తీసుకున్నారు. మిగిలిన వాళ్లందరికీ రాబోయే 50 రోజుల్లో సెకండ్ డోసు వేయాల్సి ఉంది. ఇందులోనూ సుమారు ఓ పది లక్షల మందికి రాబోయే 20 రోజుల్లోనే సెకండ్ డోసు షెడ్యూల్ ఉంది. ఇప్పటికే షెడ్యూల్ గడువు దాటి సుమారు 2 లక్షల మంది సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న కొద్దిపాటి డోసులను ఫస్ట్ డోసు కోసం వినియోగిస్తే సెకండ్ డోసు ఇవ్వలేమన్న నిర్ణయానికి ఆరోగ్యశాఖ వచ్చింది. అందుకే ఇకపై సెకండ్ డోసు వాళ్లకు ఇచ్చిన తర్వాతే ఫస్ట్ డోసు వాళ్లకు ఇవ్వాలని వ్యాక్సిన్ సెంటర్ల ఇంచార్జులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ నిర్ణయం మార్చుకున్న సర్కారు.. రెండు రోజులపాటు టీకా పంపిణీ ఆపేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడే కొనం: ప్రైవేట్ హాస్పిటళ్లు

రాష్ట్రంలో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామన్న సర్కార్ ప్రకటనతో వ్యాక్సిన్ కొనేందుకు ప్రైవేట్ హాస్పిటళ్లు వెనుకంజ వేస్తున్నాయి. లక్షలు పెట్టి కొన్నాక, సర్కారు ఫ్రీగా ఇస్తే తమ డబ్బులు వృథా అవుతాయని ఆలోచిస్తున్నాయి. సర్కార్ నుంచి స్పష్టత వచ్చాకే ఓ నిర్ణయానికి వస్తామని అంటున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఇప్పటికే కోట్ల సంఖ్యలో డోసులకు ఆర్డర్లు తీసుకున్నాయి. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ డోసులు అన్నింటినీ కేంద్ర సర్కార్‌‌‌‌కే ఇచ్చాయి. ఇకపై కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సి ఉంది.
సెకండ్ డోసు 

ఎక్కడైనా తీసుకోవచ్చు

కేంద్రం ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపేశాం. ఇప్పటికే ఇచ్చిన డోసులన్నింటినీ శుక్రవారం నాటికే వినియోగించుకోవాలని చెప్పాం. ప్రైవేట్‌‌లో ఫస్ట్ డోసు తీసుకున్నవాళ్లు కూడా, గవర్నమెంట్ సెంటర్లకు వచ్చి సెకండ్ డోసు తీసుకోవచ్చు. డోసులు లేని కారణంగా శనివారం, ఆదివారం ప్రభుత్వ సెంటర్లలో కూడా వ్యాక్సిన్ ఆపేస్తున్నాం. 18 ప్లస్ వాళ్లకు ఇంకో 3 వారాల వరకూ ఉండకపోవచ్చు.
- శ్రీనివాసరావు, డైరెక్టర్‌‌‌‌, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌

సెకండ్ డోసు కంపల్సరీ

సెకండ్ డోసు కంపల్సరీగా తీసుకోవాలి. కోవాగ్జిన్ అయితే 4 నుంచి 6 వారాల మధ్యలో, కోవిషీల్డ్‌‌ అయితే 6 నుంచి 8 వారాల మధ్యలో సెకండ్ డోసు తీసుకుంటే మంచిది. కాస్త ఆలస్యమైనా పెద్దగా ఇంపాక్ట్‌‌ ఏమీ ఉండదు. కంగారు పడాల్సిన అవసరం లేదు.
- డాక్టర్‌‌‌‌ కిరణ్‌‌ మాదాల, అసోసియేట్‌‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌‌ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌