
న్యూఢిల్లీ: చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలను కిందకు దించడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరలను తగ్గించడానికి నూనెల నిల్వలపై రిస్ట్రిక్షన్స్ పెట్టింది. దీనివల్ల ధరలు అదుపులోకి వస్తాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది. వంట నూనెలు, నూనె గింజల స్టాకులపై పరిమితులు 2022 మార్చి 31 వరకు అమలవుతాయి. ఆవ నూనె నూనె గింజలపై ఎన్సీడీఈఎక్స్‌లో ఫ్యూచర్స్ ట్రేడింగును ఈ నెల ఎనిమిది నుంచి నిలిపివేశారు. రాష్ట్రాలు తమ అవసరాలను బట్టి స్టాక్స్ పరిమితులను మార్చేందుకు కేంద్రం అధికారం ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల్లో వంటనూనెల రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో మోడీ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. దిగుమతి సుంకాలను తగ్గించింది. వివిధ ఎగుమతిదారులు, అమ్మకందారుల దగ్గర ఉన్న స్టాక్‌ల వివరాలను తప్పనిసరిగా రోజూ వెల్లడించాలని ఆదేశించింది. ఇందుకోసం ఒక వెబ్-పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. రిఫైనర్, మిల్లర్, ఎక్స్‌ట్రాక్టర్, హోల్‌సేలర్ లేదా రిటైలర్ లేదా డీలర్ ఎగుమతిదారుడు అయి, ఎక్స్‌పోర్టల్ కోడ్ నంబర్ ఉంటే మాత్రం స్టాకుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు దిగుమతి చేసుకున్న స్టాకు గురించి కూడా బయటపెట్టాల్సిన అవసరం లేదు. తమ వద్ద ఉన్న నిల్వలు పరిమితుల కంటే ఎక్కువగా ఉంటే https://evegoils.nic.in/EOSP/login ద్వారా ప్రకటించాలి. నెల రోజుల్లోపు నిల్వలను తగ్గించుకోవాలి.